పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెత మన టాలీవుడ్ ఇండస్ట్రీకి బాగా సూట్ అవుతుంది. ఇక్కడ జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, సుమన్, కృష్ణంరాజు వంటి వారు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిన తర్వాత కూడా మన దర్శకనిర్మాతలు వారిని పక్కనపెట్టి పరభాషా నటులపైనే ఆసక్తి చూపుతున్నారు. 'మిర్చి' సినిమాతో ఎంట్రీ ఇచ్చి, 'బాహుబలి' చిత్రంలో కట్టప్ప పాత్రతో హీరోలకు సరిసమానమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న సత్యరాజ్‌తో పాటు, 'ఈగ' చిత్రంతో తెలుగులో స్టార్‌డమ్ తెచ్చుకుని, 'బాహుబలి'లో సైతం ఓ పాత్రలో తళుక్కుమన్న సుదీప్‌పై కూడా మనవారు బాగా ఆసక్తి చూపుతున్నారు. ఇక మోహన్‌లాల్‌తో మన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఓ చిత్రం చేయనుండటంతో పాటు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న 'జనతాగ్యారేజ్' (వర్కింగ్ టైటిల్)లో మోహన్‌లాల్ ఓ కీలకపాత్రను చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలు గానీ బాగా ఆడాయంటే మలయాళంలోనేకాదు .. ఇప్పటికే కోలీవుడ్‌లో కూడా మంచి డిమాండ్ సంపాదించుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దున్నేస్తున్న మోహన్‌లాల్‌కు టాలీవుడ్‌లో కూడా విపరీతమైన క్రేజ్ రావడం ఖాయం అంటున్నారు. ఇలా పరభాషా నటీనటులు ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి ఊపుమీదుండటంతో మన తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు అవకాశాలు సరిగ్గా రావడం లేదనే విషయాన్ని గుర్తించాల్సివుంది.