వచ్చే సంక్రాంతికి బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయ్ ఎన్టీఆర్‌ల మధ్య బాక్సాఫీస్ పోరు తప్పేట్లు లేదని స్పష్టంగా కనిపిస్తోంది. అబ్బాయ్ సినిమా 'నాన్నకు ప్రేమతో' చిత్రం జనవరి 8న విడుదల కానుండగా, బాబాయ్ బాలకృష్ణ 'డిక్టేటర్' ఓ వారం రోజుల గ్యాప్‌లో జనవరి 14న రానుంది. అయితే విడుదలలో ఓ వారం ముందున్న 'నాన్నకు ప్రేమతో' చిత్రం ఇంకా షూటింగ్ ఇంకా పూర్తికాక ముందే వారం తర్వాత రానున్న బాలయ్య 'డిక్టేటర్'కు అప్పుడే గుమ్మడికాయ కొట్టేశారు. 'డిక్టేటర్' చిత్రానికి వస్తే దేశవ్యాప్తంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కీలకపాత్ర పోషిస్తూ వచ్చిన ఈరోస్ సంస్థ డైరెక్టర్ శ్రీవాస్‌తో కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తుండటం, నిర్మాణ రంగంలోకి ఈరోస్ అడుగుపెడుతున్న తొలి తెలుగు సినిమా కావడంతో ఇప్పటినుండే భారీ అంచనాలు మొదలయ్యాయి. కాగా ఈచిత్రం ఆడియో డిసెంబర్ 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో వైభవంగా జరుగనుంది. ఇక బాలయ్య అభిమానుల విషయానికి వస్తే.. ఎప్పుడూ మిగిలిన వారి కన్నా భిన్నంగా ఉంటుంటారు. తమ అభిమానాన్ని తమదైన రీతిలో వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు అదే రీతిలో వారు తమ అభిమానాన్ని చాటుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ ఆడియో ఫంక్షన్‌కు బాలయ్యే దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. కాగా ఈ చిత్రం బాలయ్యకు 99వ చిత్రం కావడంతో అభిమానులు హైదరాబాద్ నుండి అమరావతికి డ్రైవింగ్ చేసుకుంటూ వెల్లడానికి 99 వాహనాలను సిద్దం చేసుకుంటున్నారు. కాగా ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.