సినిమా అయినా, మీడియా అయినా ప్రజలకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి లేదా ప్రపంచం నలుమూలల జరుగుతున్న సంఘటనలను మన ముందుకు తీసుకు రావడానికి వున్నాయి. వారు చూపించే కార్యక్రమాల ద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చెయ్యడం వారి బాధ్యత. కానీ, ఈమధ్య కొన్ని ఛానల్స్ డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. డబ్బు వస్తోందంటే చాలు ఏ ప్రోగ్రామ్ చెయ్యడానికైనా, ఏది చూపించడానికైనా మేం రెడీ అనే ఛానల్స్ కొన్ని వున్నాయి. అలాగే ఆయా ఛానల్స్‌తో చేరి తాము కూడా ఎంతో కొంత సంపాదించుకోవడానికి సినిమా సెలబ్రిటీలు కూడా రెడీ అయిపోతున్నారు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? మన గతం ఏమిటి? మనం నీతి నియమాలు పాటిస్తున్నామా? నిజాయితీగా బ్రతుకుతున్నామా? అనే ఆలోచన వారికి వున్నట్టు కనిపించదు. ఎదుటివారి తప్పును ఎత్తి చూపించడానికి, వాళ్ళు ఏ బాధతో అయితే అక్కడికి వచ్చారో దాన్ని రెట్టింపు చేసి పంపించడానికి తప్ప దేనికీ ఉపయోగం లేని కార్యక్రమాలు అవి.
విపులంగా చెప్పాలంటే నిరుపేద కుటుంబాల్లో అక్షరాస్యత తక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగానే వారి జీవన విధానం వుంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం వల్ల వారి మధ్య అపార్థాలు చోటు చేసుకుంటాయి. తద్వారా కుటుంబం అల్లకల్లోలం అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే నిరుపేద కుటుంబాల్లోనే కాదు, మధ్య తరగతి కుటుంబాల్లో, ఉన్నత కుటుంబాల్లో ఈ సమస్య సర్వసాధారణం. మన చుట్టు పక్కల వారిని కదిలిస్తే ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తాయి. మధ్య తరగతి కుటుంబాలు, ఉన్నత కుటుంబాలు ఇలాంటి సమస్యలు బయటికి చెప్పడానికి ఇష్టపడరు. అందుకోసం కొన్ని ఛానల్స్ నిరుపేద కుటుంబాల్ని టార్గెట్ చేస్తున్నాయి. ఆయా కుటుంబాల్లోని వివాదాలను పరిష్కరించడానికి కంకణం కట్టుకున్నట్టుగా వారి సమస్యలతో ప్రోగ్రామ్స్ చేసుకుంటారు. తద్వారా డబ్బును దండుకుంటారు. తమ పబ్బం గడుపుకోవడానికి ఆ కుటుంబాన్ని ఛానల్స్‌కి ఈడుస్తారు. భార్యాభర్తల మధ్య వున్న గొడవని తగ్గించకపోగా మరింత పెంచే ప్రయత్నం చేస్తారు. ఒక సినిమా సెలబ్రిటీ, ఒక లాయర్, ఒక సైకాలజిస్ట్.. ఇలా అందరూ ఒకచోట చేరి అక్కడికి వచ్చిన కుటుంబాన్ని ఉద్ధరించే పని మొదలు పెడతారు. వాళ్ళు చెప్పే మాటల్ని అర్థం చేసుకునేంత జ్ఞానం పాపం వాళ్ళకి వుండదు. మరి వాళ్ళకి ఏం చెప్పి ఆ షోకి తీసుకొస్తారో తెలీదు గానీ, అక్కడికి చేరిన మేధావులు తలో మాట అనడం ద్వారా వారిని మానసికంగా గాయపరుస్తారు. ఆ ఒక్క గంట షోతో వారి జీవితాలు ఆనందంగా సాగిపోతాయా? అంటే అది ఆయా షోలను నిర్వహిస్తున్న వారికే తెలియాలి.
ప్రస్తుతం టి.వి. ఛానల్స్‌లో డబ్బు సంపాదించడమే ప్రధాన ఉద్దేశంగా చేస్తున్న ప్రోగ్రామ్స్ చాలా వున్నాయి. వాటిలో ఇదొకటి. ఇలాంటి ప్రోగ్రామ్స్ అంత దుర్భరమైన పరిస్థితి మన కుటుంబానికి లేదులే అని తృప్తి పడే కొంతమందికి నచ్చుతాయి. అలాగే భార్యా భర్తల మధ్య ఎలాంటి తగాదా వచ్చింది అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ వున్న వారికి కూడా నచ్చుతుంది. ప్రేక్షకుల బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి కొన్ని ఛానల్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ మీదే ఎక్కువ దృష్టి పెట్టాయి. వాటిని సపోర్ట్ చేసేందుకు సినిమా సెలబ్రిటీలు వుండనే వున్నారు. దీంతో సగటు మనుషుల జీవితాలతో ఆయా ఛానల్స్ ఆడుకుంటున్నాయి.