రామ్ గోపాల్ వర్మకి కావాల్సింది పబ్లిసిటీ. అది ఎలా వచ్చినా అతనికి అభ్యంతరం లేదు. ఇక అదే అతని సినిమా రిలీజుకు ముందయితే గనక ఈ తంతు మొత్తం కొత్తకొత్తగా వింతవింతగా ఉంటుంది. కిల్లింగ్ వీరప్పన్ అనే ఓ సినిమాను ఈయనగారు తీసి వచ్చే వారం మన మీదకు వదలబోతున్నారు కాబట్టి ఇప్పుడీయన యమా యాక్టివుగా ఉంటారు. దీన్ని క్యాష్ చేసుకోవడానికే అన్నట్లుగా ఓ టీవీ చానల్ వారు నిర్వహించిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్, చిరంజీవిని బాగా వాడేసుకున్నారు ఆర్జీవీ. పవన్ కళ్యాణ్ అంటే ఓ స్టార్ హీరోగా కాక ఓ మనిషిగా ఇష్టమని, అదే చిరంజీవి అంటే మాత్రం స్టారుగానే తప్ప మనిషిగా పెద్ద ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. ఇక బ్రూస్ లీని తప్పకుండా చిరు నూట యాభయ్యో సినిమాగానే పరిగణించాలని, అటు తరువాత వచ్చే మూవీని నూట యాబై ఒకటనే పిలవాలని మీడియాకు కూడా ఉచిత సలహా పంచేశారు. ఇలా తనకు తోచిన, ఇతరులకు తోయని మాటలను షో నిండా నింపేసి వీరప్పన్ విడుదలకు ముందు తనకు కావలసిన అలజడిని సృష్టించుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇంకో వారం సమయం ఉందిగా, మరిన్ని వర్మ సూక్తులు ఒక్కొక్కటిగా చర్చించుకుందాం.