ఆమీర్ ఖాన్ ఉదంతంతో భారతదేశం మొత్తం ఓసారి ఉలిక్కి పడింది. ఎట్టకేలకు తనకు గానీ, భార్య కిరణ్ రావుకు గానీ దేశం వదిలి వెళ్ళే ఆలోచనే లేదని, ఇక పై అలాంటిది కూడా ఉండబోదని ఆమీర్ స్వయానా వివరణ ఇచ్చుకునే దాకా అంతర్జాలంలో అగ్నికాష్టం రగులుతూనే ఉంది. సూపర్ స్టార్ అమీర్ ఇచ్చిన స్టేట్మెంట్ మీద మీ అభిప్రాయం ఏమిటని సుప్రసిద్ధ సంగీత దర్శకుడు, ఆస్కార్ గ్రహీత ఏఆర్ రహమాన్ గారిని దొరకబుచ్చుకుని మీడియా వారు ఇబ్బంది పెట్టబోయారు. గోవాలో జరుగుతున్న 46వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా రహమాన్ ఇక్కడికి వచ్చినప్పుడు మీడియాకి చిక్కారు. దయచేసి నన్ను ఇటువంటి ప్రశ్నలు అడిగి ఇబ్బందుల్లోకి లాగొద్దు. ఒకప్పుడు నేను కూడా ఆమీర్ లాంటి పరిస్థితిని ఎదుర్కున్నాను, అంటూ మహమ్మద్ చిత్రానికి సంగీతం అందించినందుకు తనపై రజా అకాడమీ వారు ఫత్వా జారీ చేసిన విషయాన్ని గుర్తుకు తీసుకొచ్చారు. మనది మహాత్ముడు పుట్టిన హింసకు తావులేని భూమి. ఒకరికి ఒకరం ఆదర్శంగా ఉండాలే గానీ ఒకరినొకరు కొట్టుకోకూడదు అంటూ నాలుగు మంచి మాటలు చెప్పి తెలివిగా తప్పించుకున్నారు.