వారానికి ఒకటి లేదా రెండు సినిమాలు రిలీజ్ అవుతుంటేనే అందులో బాగున్న సినిమాలను హిట్ చేసి బాగాలేని సినిమాలు చూసి అనారోగ్యానికి గురవుతున్న సగటు ప్రేక్షకుడిపై ఒక్కసారిగా ఆరు సినిమాలు దాడి చేయబోతున్నాయి. ఆయా సినిమాల దర్శకనిర్మాతలు ఒకే రోజు తమ తమ సినిమాలు రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అయినట్టున్నారు. అందుకే థియేటర్లు ఎన్ని దొరుకుతాయి? ఏ నిర్మాతకు ఎంత వరకు వర్కవుట్ అవుతుందనేది ఆలోచించకుండా ఈ ఆరు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.
అనుష్క హీరోయిన్‌గా కె.ఎస్.ప్రకాషరావు దర్శకత్వంలో పి.వి.పి. నిర్మించిన సైజ్‌జీరో, దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్, అవికా గోర్ జంటగా అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాలా జంపాలా చిత్రాల నిర్మాత పి.రామ్మోహన్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన తను నేను, నేను నా ప్రేమకథ, అయ్యో రామ, లవ్‌స్టేట్స్, ఎఫైర్ చిత్రాలు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా రిజల్ట్ అనేది ప్రేక్షకుల చేతుల్లోనే వుంది. ఏ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయో, ఏ సినిమాలు వారిని అసహనానికి గురి చేస్తాయో తెలుసుకోవాలంటే వెయిట్ చేసి చూడాల్సిందే.