నేడు భారీ బడ్జెట్ చిత్రాల పరిస్థితి తెగిన గాలిపటంలా తయారైంది. దాంతో చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెత బాగా సూటవుతుంది. వాస్తవానికి సినిమా పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్లు బాగుంటేనే నిర్మాతలు బాగుంటారు. భారీ బడ్జెట్‌తో టాప్‌స్టార్స్‌తో సినిమాలు తీస్తే నష్టాలు వచ్చినా నిర్మాతలకు పెద్దగా టెన్షన్ ఉండదు. ప్రీరిలీజ్‌లోనే వారికి టేబుల్ ప్రాఫిట్ వస్తుంది. ఇక శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, సినిమా బాగుంటే రీమేక్, డబ్బింగ్ రైట్స్ వంటివి ఉంటూనే ఉంటాయి. కానీ ఈ చిత్రాలను ముందు వెనుక చూడకుండా ఆయా హీరోల మార్కెట్ ఎంత? ఆయా హీరోలపై ఎంతవరకు పెట్టుబడి పెట్టవచ్చు.. అనే ఆలోచన చేయకుండా ఎడాపెడా భారీగా ఒకరినొకరు పోటీపడి మరీ ఆయా చిత్రాలను కోట్లు పెట్టుబడి పెట్టి కొంటున్నారు. సినిమాలో ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఇక డిస్ట్రిబ్యూటర్లకు చుక్కలు కనిపిస్తాయి. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్ల నెత్తినే పిడుగుపడుతోంది. భారీ రేట్లకు కొని చివరకు రికవరీ కష్టమై పోతుండటంతో డిస్ట్రిబ్యూటర్లు.. నిర్మాతలను, హీరోలను కలిసి తమకు పరిహారం ఇవ్వాలని అడుక్కోవాల్సిన పరిస్థితి తయారవుతోంది. 'ఆగడు, బ్రూస్‌లీ, అఖిల్' చిత్రాలు వీటికి పెద్ద ఉదాహరణ. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ 'లింగా',. విజయ్ 'పులి' విషయంలో ఎంత పెద్ద రాద్దాంతం జరిగిందో అందరికీ తెలిసిందే. వాస్తవానికి 'గోపాల గోపాల, టెంపర్, సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాలు బాగానే ఆడాయి. కానీ డిస్ట్రిబ్యూటర్లు రేట్లు ఎక్కువ కుమ్మరించి, విపరీతమైన రేట్లకు కొనడం వల్లే డిస్ట్రిబ్యూటర్లకు అనుకున్న స్థాయిలో లాభాలు రాలేదు. క్రేజ్ చిటికెడు-బడ్జెట్ బారెడు అనే తరహాలో ఈ చిత్రాలను డిస్ట్రిబ్యూటర్లు భారీ రేట్లకు కొనడం వల్ల నిర్మాతలకు మాత్రం లాభాలు భారీగానే వస్తున్నాయి. కానీ డిస్ట్రిబ్యూటర్ల అత్యుత్సాహంతో వారికి నష్టాలు వస్తున్నాయి. ఇప్పటికైనా వారు కళ్లు తెరిచి హీరోల స్థాయిని బట్టి కాకుండా, ఇతరులతో పోటీపడకుండా.. నిగ్రహం పాటిస్తూ ఒక యూనిటీ పాటిస్తే మంచిది.