మొన్నటి వరకు మణిశర్మ, కీరవాణి.. నిన్నటి వరకు దేవిశ్రీప్రసాద్, తమన్‌ల జోరు కొనసాగింది. ఏ స్టార్ హీరో చిత్రాన్ని చూసినా వీరు పేర్లే వినపడుతాయి. దీంతో మొనాటనీ వస్తోంది. దాంతో కొత్త కొత్త సంగీత తరంగాలను ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారు. ఎప్పుడూ దేవిశ్రీనే వెంటపెట్టుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం నితిన్‌తో తాను చేస్తోన్న 'అ..ఆ..' చిత్రానికి తమిళంలో అదరగొడుతున్న అనిరుధ్‌ను సంగీత దర్శకునిగా పెట్టుకున్నాడు. 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, భలే భలే మగాడివోయ్' చిత్రాలతో మలయాళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. కాగా ఆయన ప్రస్తుతం నాగార్జున, కార్తి, తమన్నా వంటి వారు ప్రధానపాత్ర పోషిస్తున్న 'ఊపిరి' చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న విక్టరీ వెంకటేష్- మారుతి కాంబినేషన్ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించనున్నాడు. వరుసగా కమల్‌హాసన్ చిత్రాలకు పనిచేసిన జిబ్రాన్ ఇప్పటికే టాలీవుడ్‌లో 'రన్ రాజా రన్, జిల్' చిత్రాల ద్వారా ఆకట్టుకున్నాడు. త్వరలో సెట్స్‌పైకి వెళ్తుందని భావిస్తున్న పూరీ-మహేష్‌బాబుల చిత్రానికి కూడా సంగీతం అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సుజీత్ డైరెక్షన్‌లో ప్రభాస్ నటించే చిత్రానికి కూడా ఆయనే సంగీతం అందించనున్నాడు. రవితేజ నటించిన 'బెంగాల్‌టైగర్' చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. వీరే కాకుండా అనూప్‌రూబెన్స్, మిక్కీజె మేయర్, 'ఎవడే సుబ్రమణ్యం'కు సంగీతం అందించిన రాధన్ వంటి యువకెరటాలు దేవిశ్రీ, తమన్‌లకు చెక్ పెట్టడానికి రెడీ అవుతున్నారు.