అక్కినేని అఖిల్ హీరోగా తెరంగేట్రం చేసిన 'అఖిల్' చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భారీ బడ్జెట్, భారీ తారాగణం, స్టార్ డైరెక్టర్, స్టార్ నిర్మాత.. ఇలా అన్నింటిలోనూ భారీతనం కలగలిపిన ఈ చిత్రం తొలిరోజు ఓపెనింగ్స్ భారీగానే రాబట్టింది. కానీ అనూహ్యంగా రెండో రోజు నుండే థియేటర్లు నిండని పరిస్థితి ఏర్పడింది. మొదటిరోజు 10కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం తర్వాతి నాలుగురోజుల్లో కేవలం 6కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. దాదాపు 40కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా నిర్మాత నితిన్‌కు ఏకంగా 20కోట్ల నష్టాలు తప్పవని ట్రేడ్‌వర్గాలు ఖచ్చితంగా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు కూడా భారీ నష్టాలే మిగిలాయి. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లలో నాగార్జున రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. నితిన్‌పై ఏ విధమైన ఒత్తిడి చేయవద్దని, భవిష్యత్తులో అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చే సినిమాలను రీజనబుల్ రేటుకు ఇప్పిస్తానని నాగ్ మాట ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి ఇబ్బందుల్లో పడతాడనుకున్న నితిన్ నాగ్ హామీతో ఊపిరి పీల్చుకున్నాడని సమాచారం.