నాగ చైతన్యను జోష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడంలో తండ్రిగా నాగార్జున అప్పట్లో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని, ఇక ఇప్పుడు అఖిల్ డెబ్యూ విషయంలో సైతం అఖిల్ ప్రాజెక్టుతో అదే లేదా అంతకంటే పెద్ద మిస్టేక్ చేసాడని అక్కినేని ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. ఏ తండ్రికయినా కొడుకుని తనకంటే ఉన్నత స్థానంలో చూసుకోవాలన్న తపన ఉంటుంది. అందుకే ఆచితూచి వేసిన రెండు అడుగులు తప్పటడుగులు పడడంతో నాగార్జున క్యాల్కులేషన్ పూర్తిగా బెడిసి కొట్టినట్టయింది.
నాగార్జున గారు నిజానికి చైతును పెట్టింది మామూలు చేతిలో కాదు. అప్పట్లో దిల్ రాజు అంటేనే ఓ గోల్డెన్ హ్యాండ్. కథాపరంగా కూడా జోష్ ఈనాటి అఖిల్ మీద ఎన్నో వేల రెట్లు బెటర్. కానీ వయసుకు మించిన, మొదటి ప్రాజెక్టుకు కావాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో కంటెంట్ ఉండడంతో చైతు తేలిపోయాడు.
జోష్ లాంటిదే మళ్ళీ రిపీట్ అయితే అఖిల్ భవిష్యత్తుకు జరిగే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన నాగార్జున ఎన్నో లెక్కలేసి వీవీ వినాయక్ గారిని దర్శకుడిగా ఎంచుకున్నారు. బట్ ఫైనల్ ఫలితం మాత్రం సేం. అఖిల్, జోష్ విషయాలలో జరిగిన నష్టాన్ని మరోసారి బేరీజు వేస్తే ఆయా దర్శకులయిన వినాయక్, వాసు వర్మలే ముఖ్య కారకులు తప్ప నాగార్జున కాదు అన్నది స్పష్టం.