మొత్తానికి అటు నందమూరి బాబాయ్ బాలకృష్ణ 'డిక్టేటర్'తో, జూనియర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' చిత్రాలతో ఒకేసారి సంక్రాంతి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదిఏమైనా ఎవరు ఎదురు వచ్చినా తగ్గేది లేదని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఇక తాజాగా ఈ బరిలోకి అనుకోకుండా ఎంట్రీ ఇచ్చాడు హీరో సునీల్. ఆయన హీరోగా వాసువర్మ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న 'కృష్ణాష్టమి' సైతం సంక్రాంతి రేసులోకి దిగుతుంది. తమది పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ కావడం వల్ల తమకు ఏ చిత్రం పోటీ కాదని ఈ చిత్ర నిర్మాత దిల్‌రాజు ఆలోచనగా కనిపిస్తోంది. కాగా డిసెంబర్‌లో నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం రిలీజ్ ఉండటం, దీనికి తోడు 'మామ మంచు.. అల్లుడు కంచు'; గోపీచంద్ 'సౌఖ్యం'లు క్రిస్మస్ కానుకగా విడుదలవుతుండటంతో తనకు ఎంతో అచ్చివచ్చిన నెలను నాగ్ త్యాగం చేసి తాను కూడా తన 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్-నితిన్‌ల కాంబినేషన్‌లో వస్తోన్న 'అ..ఆ..' చిత్రాన్ని కూడా సంక్రాంతి బరిలో దింపి తన సత్తా చాటాలని త్రివిక్రమ్ అనుకుంటున్నాడట. మరి చివరకు సంక్రాంతి రేసులో ఎన్ని, ఏయేచిత్రాలు పోటా పోటి పడతాయో, ఎంత సందడి చేస్తాయో చూద్దాం..!!?