దక్షిణాదిలో సూపర్‌హిట్ అయిన పలు చిత్రాలను రీమేక్ చేసి లాభాలు గడించాలని బాలీవుడ్ స్టార్స్ నుండి నిర్మాతల వరకు అందరూ భావిస్తున్నారు. దీంతో దక్షిణాదిలో విడుదల అవుతున్న అన్ని చిత్రాలపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. దక్షిణాది చిత్రాలను చేయడానికి స్టార్ హీరోలు కూడా ఉత్సాహంగా ఉండటంతో దక్షిణాది చిత్రాలు ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌కేకుల్లా మారాయి. గతంలో ఎప్పుడో వచ్చి ఘనవిజయం సాధించిన 'ఒక్కడు, ఠాగూర్, స్టాలిన్' వంటి చిత్రాలను కూడా బాలీవుడ్ హీరోలు వదిలిపెట్టలేదు. కాగా 'గబ్బర్' చిత్రంతో బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్ తాజాగా తీసిన 'కంచె' చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలోనే నిర్మించాలని అక్కడి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మహేష్‌బాబు నటించిన 'శ్రీమంతుడు' పై చాలామంది స్టార్స్ కన్నేశారు. యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో ఈ చిత్రానికి పోటీ విపరీతంగా ఉంది. మరోవైపు తమిళంలో సంచలన విజయం సాధించిన 'తని ఒరువన్' చిత్రాన్ని ఒరిజినల్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలోనే చేయడానికి సల్మాన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.