అక్కినేని అఖిల్ హీరోగా రేపు విడుదల కాబోతున్న అఖిల్ చిత్రం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. దసరాకి రావాల్సిన సినిమా దీపావళికి వస్తున్నా అక్కినేని అభిమానుల ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో అఖిల్ డ్యాన్సుల్లో, పోరాటాల్లో ఇరగదీస్తున్న తీరు చూసి అప్పుడే అక్కినేని పిల్లోడికి ఫ్యూచర్ సూపర్ స్టార్ అన్న ముద్దు పేరును తగిలించేసారు. పైగా అఖిల్ రిలీజు కూడా స్టార్ హీరోలకు దీటుగా ఉండడంతో ఇంత చిన్న వయసులోనే పెద్ద భారాన్ని మోయాల్సి వస్తోంది. కానీ తెలివిగా అఖిల్ మాత్రం ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ అన్నీ దర్శకుడు వినాయక్ గారేనని సవినయంగా విన్నవిస్తున్నాడు.
నా మొదటి సినిమా ఇలాగే ఉండాలని నేను ఎప్పుడు అనుకోలేదు. అఖిల్ కథ విన్నాక కూడా నాకు ఓ రకంగా భయంగానే ఉండేది. కానీ నితిన్ ఎప్పుడైతే వినాయక్ గారిని పరిచయం చేసారో, అప్పుడే నాకు అర్థం అయిపొయింది. ఐ యాం ఇన్ సేఫ్ హ్యాండ్స్. అఖిల్ సినిమా స్కేలు ఇంత లార్జుగా ఉండడానికి వినాయక్ గారే కారణం. ఆయనొక పరిపూర్ణమైన కమర్షియల్ ప్యాకేజిని ప్రిపేర్ చేసారు, అంటూ బరువును అంతా వినాయక్ మీదే పెట్టేసాడు అఖిల్.