గోపీచంద్, రేజీనా హీరో హీరోయిన్లుగా రవి కుమార్ చౌదరి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం సౌఖ్యం. కోన వెంకట్, గోపి మోహన్లతో పని చేసి ఇంతకు మునుపే లౌక్యం చిత్రంలో బ్రేక్ అందుకున్న గోపీచంద్ మరోసారి వారితోనే సౌఖ్యంగా ముందుకు రాబోతున్నాడు. సంగతి ఏమిటంటే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలకు సిద్ధం అవుతోంది. ఏడాది ఆఖరులో ఎందఱో నిర్మాతలు తమ తమ చిత్రాల రిలీజులు ప్లాన్ చేసుకోవడం ఎప్పుడు జరిగే తంతే. అక్కినేని నాగార్జున గారికి అయితే డిసెంబర్ సెంటిమెంట్ అంటూ ఒకటి ఉంది. ఈయన గారి చిత్రాల్లో ఎక్కువగా డిసెంబరులో విడుదలైనవే విజయాన్ని సాధించాయి. అందుకే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్ని నాయనాను డిసెంబరులో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అంటే చాలా ముందుగా అదే డిసెంబర్ 25ను మోహన్ బాబు, అల్లరి నరేష్ చిత్రం మామ మంచు అల్లుడు కంచు కూడా బ్లాక్ చేసింది. అంటే ఒకే రోజు మోహన్ బాబు, గోపీచంద్ డీకొట్టబోతున్నారు. డిసెంబర్ నెలాఖరులో ఈ రెండింటి మధ్యే ముఖ్యమైన పోటీ ఉండేలా కనీసం రెండు నెలల ముందుగానే డేట్లు బుక్ చేసారంటే ఇది సౌఖ్యం కాదు దర్శక నిర్మాతల లౌక్యం అంటున్నారు సినీ జనాలు. మోహన్ బాబు, గోపిల భయానికి మిగతా నిర్మాతలు ఏ జనవరికో లేకపోతే డిసెంబర్ మొదటి రెండు వారాలకో పారిపోతారుగా...