అయితే అతివృష్టి, లేకపోతే అనావృష్టి. ఇదీ తెలుగు సినిమా తంతు. పండగ సీజన్, హాలిడే సీజన్ వస్తే సినిమాలకు గిరాకీ పెరుగుతుందన్న మాట నిజమే కానీ మరీ ఇంతలా గుంపు గుంపులుగా వచ్చి థియేటర్ల మీద పడిపోతే ఏ నిర్మాతకు ఎంత వస్తుంది, అసలు ఆడియెన్స్ కనీసం వీటిని దేకుతారా, బయ్యర్లు బతుకుతారా అన్న ఆలోచనకు తావే లేకుండాపోయింది. దసరాకు మిస్సయిన చాలా చిత్రాలు దీపావళికి క్యూ కడుతున్నాయి. అఖిల్ అన్న భయం కూడా లేకుండా వరసపెట్టి డబ్బింగ్ సినిమాలను జనాల మీదకి వదలబోతున్నారు. అజిత్ ఆవేశం, ధనుష్ మరియన్ ఈ కోవకు చెందినవే. వీరిద్దరూ ఓకె. కానీ అకస్మాత్తుగా లిస్టులో చేరిపోయిన సినిమా త్రిష లేదా నయనతార. యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ హీరోగా తమిళంలో ఇరగాడేసిన త్రిష ఇళ్ళ నయనతారకు ఇది తెలుగు డబ్బింగ్ రూపం. మారుతి మొదలు పెట్టిన బూతు ప్రేమ కథల కోవకే చెందింది ఈ త్రిష, నయనతార. ఇదే విషయాన్ని ఊరికే చెబితే వినబడుతుందో లేదో అనుకున్నారు సదరు నిర్మాతలు. అందుకే గెట్ రెడీ వర్జిన్స్ అంటూ ట్యాగ్ తగిలించి మరీ మార్కెట్టులోకి వదిలిపెట్టారు. మీరు త్రిష, నయనతార టైటిల్ చూసి మోసపోకండి, మాది ఫక్తు బూతు చిత్రం అని కుర్రకారును రెచ్చగొట్టి మరీ థియేటర్లకు రప్పించేలా ఉనాయి వీళ్ళ ప్రమోషన్స్. అందుకే ఈ వర్జిన్స్, మూతి ముద్దు పోస్టర్లు.