సీనియర్ కమెడియన్, తెలుగు సినిమా నవ్వుల రారాజు బ్రహ్మానందం తేజస్సు తగ్గుతోందా? ఇంతకు మునుపు హీరోలను కూడా డామినేట్ చేసే పాత్రల్లో అగుపించిన బ్రహ్మి ఇప్పుడు పాత్రల కోసం వెంపర్లాడుతున్నాడా? వస్తున్న అరకొర పాత్రల్లో హాస్యం పండించలేక అపహాస్యం పాలవుతున్నాడా? జనరేషన్ గ్యాప్ చూసుకుంటూ, మారుతున్న ప్రేక్షక దేవుళ్ళ అభిరుచులకు అనుగుణంగా బ్రహ్మానందం తన స్టైల్ చెక్ చేసుకుంటూ వస్తున్నాడు గనకే ఇన్నాళ్ళు మనుగడ సాధించగలిగాడు. కానీ రచయితల, దర్శకుల పుణ్యమాని బుల్లి తెర మీద వెలిగిపోయిన జబర్దస్త్ బ్యాచ్ మొత్తం కలిపి బ్రహ్మీ బ్యాండ్ బజాయించేస్తున్నారు.
షకలక శంకర్, ధనరాజ్, రాకెట్ రాఘవ లాంటి కుర్ర కమెడియన్స్ తక్కువ పారితోషికానికే తమ డేట్లు సర్దుతున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా రొటీనుగా బ్రహ్మానందం చేసే ఫన్ ఆనందించలేకపోతున్నారు. ఎమ్మెస్, ధర్మవరపులాంటి హాస్యనటుల కొరత కూడా బ్రహ్మీకి శరాఘాతంగా మారింది. అందుకేనేమో బ్రూస్ లీ, షేర్ లాంటి చిత్రాల్లో అవకాశం కోసం ఏమైనా చేస్తా అన్నట్లుగా వెకిలి చేష్టలు చేసి మర్యాద దిగజార్చుకున్నాడు.
ఒక వైపు రాజు గారి గది సూపర్ డూపర్ విజయంతో శంకర్, ధన రాజ్, సప్తగిరి లాంటి కుర్ర బ్యాచు గోలగోల చేస్తూ ఉరకలేస్తుంటే, బ్రూస్ లీ అండ్ షేర్ అపజయంతో బ్రహ్మీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. మరిన్ని విమర్శలు చుట్టుముట్టక ముందే బ్రహ్మి రిటైర్ అవుతాడేమో అన్న గాసిప్ కూడా ఊపందుకుంది.