కొత్త బంగారులోకం తో దిల్ రాజు కాంపౌండ్ నుంచి పరిచయమైన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. తొలిచిత్రంలో టీనేజ్ యువతీ,యువకుల భావోద్వేగాలను అందంగా ఆవిష్కరించిన శ్రీకాంత్ అడ్డాల అందరి మన్ననలు పొందాడు. అయితే ఆ చిత్రం తర్వాత దాదాపుగా రెండున్నర సంవత్సరాలు ఖాళీగానే వున్నాడు శ్రీకాంత్. ఆ తర్వాత దిల్‌రాజు చొరవతో అతిపెద్ద మల్టీస్టారర్‌గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని తెరకెక్కించాడు. చాలా రోజుల తర్వాత అగ్రహీరోలు కలిసి నటించిన చిత్రం కావడం, ఇద్దరూ ఫ్యామిలీ హీరోలు కావడంతో ఆ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. ఇప్పటికీ ఆ చిత్రాన్ని అందరూ టీవీ సీరియల్‌తో పోల్చడం..అసలు కథ లేకుండా దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించాడు అని విమర్శలు వినిపిస్తుంటాయి. అంతేకాదు ఆ తర్వాత నాగబాబు తనయుడు అరంగ్రేటం చిత్రం ముకుంద విషయంలో కూడా శ్రీకాంత్ అడ్డాల ఇదే తరహా విమర్శలను మూటగట్టుకున్నాడు. తొలిసినిమా కొత్త బంగారులోకం కూడా భావోద్వేగాల సమహారంతోనే నడుస్తుంది. ఇక తాజాగా మహేష్‌తో బ్రహ్మోత్సవం సినిమాను తెరకెక్కిస్తున్నాడు శ్రీకాంత్. ఈసారైనా బలమైన కథతో తీస్తున్నాడా.. లేక అసలు కథ లేకుండా స్టార్‌చరిష్మాతోనే సినిమాను గట్టేక్కించే ప్రయత్నంలో వున్నాడా? అనే చర్చలు మొదలయ్యాయి. సో.. శ్రీమంతుడు లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై మహేష్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు బ్రహ్మోత్సవం రీచ్ అయ్యే విధంగా శ్రీకాంత్ ప్లాన్ చేసుకోవాలి..!