దర్శకుడిగా క్రిష్ తనకంటూ ఓ గుర్తింపును మొదటి సినిమాతోనే తెచ్చేసుకున్నాడు. ఈయన నుండి ఓ సినిమా వస్తోందంటే ఒక వర్గం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. అందుకే క్రిష్ కూడా ఆ వర్గాన్ని నిరాశ పరిచేలా ఎప్పుడో సినిమాలు కూడా చేయలేదు. ఈయనలోని పనితనాన్ని చూసి సంజయ్ లీలా భన్సాలి లాంటి దర్శక నిర్మాతలు కూడా గబ్బర్ ఈజ్ బ్యాక్ అనే టాగూర్ రీమేక్ చిత్రాన్ని క్రిష్ భుజస్కందాల మీద పెట్టారు. అయితే గబ్బర్ చిత్రం దక్షిణ భారత దేశంలో పెద్దగా ఆడకపోయినా ఉత్తరాన మాత్రం అక్షయ్ కుమార్, శృతి హాసన్ జంటకు నీరాజనాలు పట్టి వంద కోట్ల క్లబ్బులో చేర్పించారు. దీనితో క్రిష్ గారికి బాలివుడ్ అంతటా మాంచి పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ పరిచయాలతోనే పలు వ్యాపార సంస్థలకు ముంబైలో యాడ్స్ కూడా చేసాడు.
ఇంతటితో ఆగకుండా ప్రస్తుతం క్రిష్ తాను తీసిన కంచె సినిమాను హిందీ రీమేక్ చేసే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కంచెని తెలుగులో కేవలం 20 కోట్ల బడ్జెట్లో ముగించి విమర్శకుల మన్ననలు అందుకున్నాడు క్రిష్. దౌర్భాగ్యం ఏమిటంటే ఇక్కడ ఈ బడ్జెట్ కూడా రికవర్ చేయడం కష్టమే అన్నట్లుంది ప్రస్తుతం సినిమా పరిస్థితి. కానీ కంచె కాన్సెప్టుకు ముగ్ధులై ముంబైలోని పలువురు నిర్మాతల నుండి కాల్స్ రావడంతో క్రిష్ ప్లాన్ వర్క్ అవుట్ అవుతున్నట్టే కనిపిస్తుంది. గబ్బర్ సినిమాతో ఏర్పరుచుకున్న లింకులని సరిగ్గా వాడుకుంటే క్రిష్ తప్పకుండా కంచెను హిందీలో రీమేక్ చేసి వంద కోట్ల క్లబ్బులో తన రెండో సినిమాను జమ చేయడం ఖాయం.