రామ్‌చరణ్ నటించిన బ్రూస్‌లీ చిత్రం విమర్శకులను, రివ్యూ రైటర్స్‌ను మెప్పించలేకపోయింది. అంతేకాదు ఈ సినిమా చూసిన మెగాభిమానులు కూడా పెదవి విరిచారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడం వల్ల దానికి తోడు దసరా సీజన్ కలిసి రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు రాబట్టుకోగలిగింది. తొలివారం దాదాపుగా 35కోట్లు తెచ్చుకుంది. నైజాంలో దాదాపు 7.5కోట్లు దక్కాయి. ఆంధ్రాలో 13కోట్లు సాధించింది. ఇక ఓవర్‌సీస్‌లో మరీ దారుణంగా కేవలం రెండు కోట్లు మాత్రమే దక్కించుకొంది. వీటికి శాటిలైట్ మొత్తాన్ని కూడా కలుపుకుంటే బ్రూస్‌లీ గట్టెక్కినట్లే అని అంటున్నారు. బుధ, గురు వారాల్లో ఈ చిత్రం వసూళ్లు మరలా పుంజుకోవడం గమనించవచ్చు. పోటీగా ఏ సినిమా లేకపోవడం, అఖిల్ సినిమా వాయిదాపడటం, అఖిల్ సినిమా కోసం లాక్ చేసిన థియేటర్లలో కూడా బ్రూస్‌లీ నే ఆడుతుండటం, వీకెండ్‌లో మరింత రాబట్టుకునే అవకాశం ఉండటం... ఇవ్వన్నీ కలిస్తే ఈ చిత్రం నిర్మాత కాస్త సేఫ్‌గానే ఉండే అవకాశం ఉందని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి. మొత్తానికి కొన్ని విషయాల్లో రామ్‌చరణ్ అదృష్టవంతుడనే చెప్పాలి. మంచి సెలవు దినాలను రిలీజ్‌కు ప్లాన్ చేసుకోవడం, పోటీ లేకుండా బరిలోకి దిగడం.. వంటి కారణాల వల్లనే ఈ మాత్రం కలెక్షన్లు బ్రూస్‌లీ కి దక్కాయి. గతంలో కూడా చరణ్ ఇలాంటి ప్లానింగ్ వల్లే గోవిందుడు అందరివాడేలే వంటి చిత్రాలు కూడా ఫ్లాప్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా ఓకే అనిపించుకున్నాయి.