అందరి మంచీ కోరేవాడు, అందరికీ ఉపయోగపడేవాడు, ఆపదలో వున్నవారిని ఆదుకునేవాడిని సినిమాల్లో హీరోగా పరిగణిస్తాం. సినిమాల్లో మంచి హీరోగా పేరు తెచ్చుకున్న ప్రతి నటుడూ నిజజీవితంలో కూడా హీరో అనిపించుకుంటాడన్న గ్యారెంటీ లేదు. కానీ, హీరో కళ్యాణ్‌రామ్ విషయంలో మాత్రం అది అక్షరాలా నిజం అని చెప్పాలి. ఒక డైరెక్టర్‌తో చేసిన సినిమా ఫ్లాప్ అయితే అతన్ని కన్నెత్తి కూడా చూడని హీరోలున్న ప్రస్తుత పరిస్థితుల్లో తనకి ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్‌తోనే మూడో సినిమా కూడా చేసేందుకు సిద్ధపడిన నటుడ్ని హీరో అనే కదా అనాలి. కళ్యాణ్‌రామ్ ఫస్ట్ మూవీ తొలిచూపులోనే ఫ్లాప్ అయింది. మల్లికార్జున్ డైరెక్షన్‌లో చేసిన రెండో సినిమా అభిమన్యు కూడా డిజాస్టర్ అయింది.
ఆ తర్వాత ఎన్.టి.ఆర్. ఆర్ట్స్ బేనర్‌ని స్టార్ట్ చేసి అతనొక్కడేతో సూపర్‌హిట్ కొట్టిన కళ్యాణ్‌రామ్ తనకు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ మల్లికార్జున్‌కి రెండో అవకాశం ఇచ్చి అతనితో కత్తి చిత్రాన్ని చేశాడు. అది కూడా డిజాస్టర్ అయింది. పటాస్ వంటి సూపర్‌హిట్‌తో ఈ సంవత్సరాన్ని ప్రారంభించిన కళ్యాణ్‌రామ్ తనకు రెండు ఫ్లాపులిచ్చిన మల్లికార్జున్‌కి మూడో అవకాశం ఇచ్చాడు. తనకు మూడో సినిమా ఇచ్చిన తన హీరోకి ఎట్టి పరిస్థితుల్లోనూ సూపర్‌హిట్ ఇవ్వాలన్న కసితో షేర్ చిత్రాన్ని కష్టపడి చేశాడు మల్లికార్జున్. ఈ చిత్రాన్ని అఖిల్ పోస్ట్‌పోన్ అయిన కారణంగా అక్టోబర్ 22కే రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ, మొదట అనుకున్న విధంగానే 30కే రావాలని ఫిక్స్ అయ్యారు. నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్న తన హీరో కళ్యాణ్‌రామ్‌కి మూడో సినిమాతో అయినా మల్లికార్జున్ సూపర్‌హిట్ ఇస్తాడేమో చూడాలి.