ఒకప్పుడు మన హీరోలు కుటుంబ కథా చిత్రాలు చేయడానికి బాగా ఆసక్తి చూపేవారు. కానీ రాను రాను కుటుంబ కథా చిత్రాలు అనే పదానికి అర్థం మారిపోతోంది. ఇప్పుడు కుటుంబ కథా చిత్రాలు అంటే ఆయా హీరోలు తమ కుటుంబంలోని ఇతర హీరోల కోసం స్థాపించే ప్రొడక్షన్ హౌస్‌లుగా మారాయని అర్థం అవుతోంది. ఉదాహరణకు చెప్పాల్సి వస్తే... నందమూరి కళ్యాణ్‌రామ్ ఇంతకాలం తన తాత పేరు మీద ఓ బేనర్ స్థాపించి తానే హీరోగా పలు చిత్రాలు చేశాడు. కానీ ఇటీవల ఆయన వేరే హీరో అంటే రవితేజ హీరోగా కిక్2 చిత్రం తీసి చేతులు కాల్చుకున్నాడు. కాగా రాబోయే రోజుల్లో ఆయన బాబాయ్ నందమూరి బాలకృష్ణ, తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్‌లతో సినిమాలు తీయడానికి రెడీ అవుతున్నాడు. ఇక రామ్‌చరణ్ తన తండ్రి నటించే 150వ చిత్రానికి నిర్మాత అవతారం ఎత్తుతోన్న సంగతి తెలసిందే. ఆయన రెండు సంస్థలను స్థాపించి ఒక దాంట్లో కేవలం మెగాహీరోలతోనే సినిమాలు చేస్తాడట. మరో బేనర్‌లో మాత్రం ఇతర హీరోల చిత్రాలను నిర్మిస్తాడని అంటున్నారు. ఇక పవన్‌కళ్యాణ్ కూడా ఎప్పుడో పవన్‌కళ్యాణ క్రియేటివ్ వర్క్స్ అనే సంస్థను స్థాపించాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం సర్దార్ గబ్బర్‌సింగ్ ను కూడా ఆయన తన స్నేహితుడు శరత్‌మరార్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. త్వరలో రామ్‌చరణ్‌తో కూడా సినిమా చేయబోతున్నాడు. ఇక మహేష్‌బాబు తన పేరుపైనే ఓ నిర్మాణ సంస్థను స్థాపించి తాను నటించే చిత్రాలన్నిటికీ ఆయన సహనిర్మాతగా వ్యవహరించనున్నాడు. మహా అయితే సుధీర్‌బాబు వంటి వారితో మాత్రం సినిమాలు చేసే ఉద్ధేశ్యం ఆయనకు ఉందని సమాచారం. మొత్తానికి మన హీరోల ఫ్యామిలీ చిత్రాలకు రోజురోజుకీ పేర్ల అర్థం మారిపోతోంది.