ఎన్నో అవాంతరాలు, మరెన్నో ఒడిదుడుకుల నడుమ ఎట్టకేలకు అక్టోబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన రుద్రమదేవి చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. దానికి విశ్లేషకుల విమర్శలు కూడా తోడయ్యాయి. అయితే ఈ చిత్రానికి వస్తోన్న కలెక్షన్లను పరిశీలిస్తే సినిమా ఎలా వున్నా చూడాల్సిందేనని ఆడియన్స్ ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. బాహుబలి చిత్రానికి కూడా ఇదే తరహాలో కలెక్షన్ల వెల్లువ మొదలైంది. అయితే రుద్రమదేవి చిత్రానికి అంతటి స్థాయిలో కలెక్షన్లు రానప్పటికీ బాహుబలి తర్వాత స్థానంలో రుద్రమదేవి నిలుస్తుందన్న నమ్మకాన్ని కలిగిస్తోందని దర్శకనిర్మాత గుణశేఖర్ చెప్తున్నాడు. కానీ, బాహుబలి తర్వాతి స్థానంలో ఆల్రెడీ శ్రీమంతుడు వచ్చి చేరింది. కాబట్టి రుద్రమదేవికి మూడో స్థానం దక్కే అవకాశం వుంది. కలెక్షన్లపరంగా గుణశేఖర్ శాటిస్‌ఫై అయినప్పటికీ దర్శకుడిగా ఈ సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేకపోయానన్న బాధ ఎక్కువగా వున్నట్టు కనిపిస్తోంది. ఈమధ్య జరిగిన ప్రెస్‌మీట్‌లో గుణశేఖర్ మాట్లాడుతూ సినీ విమర్శకుల మేధస్సును మెప్పించలేకపోయినా, ప్రేక్షకుల మనసుల్లో మాత్రం తనకు చోటు కల్పించారని, ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్లే దానికి నిదర్శనమని అన్నాడు. రుద్రమదేవి చిత్రానికి వెబ్‌సైట్లలో వచ్చిన రివ్యూలను పరిశీలిస్తే గుణశేఖర్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి విరుద్ధంగా సమీక్షలు రావడం వల్ల బాగా డిజప్పాయింట్ అయినట్టు కనిపిస్తోంది. అయినా ప్రస్తుతం గుణశేఖర్ వున్న పరిస్థితుల్లో అతనికి కావాల్సింది ప్రశంసల వర్షం కాదు, కాసుల వర్షం. మూడు సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా తనని లాభాల బాటలో నడిపిస్తుందన్న గట్టి నమ్మకంతో వున్నాడు గుణశేఖర్.