సూపర్‌స్టార్ రజనీకాంత్, శంకర్‌ల కాంబినేషన్‌లో సన్ పిక్చర్స్ నిర్మించిన రోబో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ చేయబోతున్నట్టు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. ఇదిలా వుంటే ఈ చిత్రంలో హాలీవుడ్ హీరో అర్నాల్డ్ ష్వార్జనెగర్ విలన్‌గా నటిస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. కానీ, ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తున్నారన్నది మాత్రం కన్‌ఫర్మ్‌గా తెలియడంలేదు. రెండో పార్ట్‌ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించేందుకు సిద్ధంగా లేదన్నది మనకు తెలిసిందే. ఒక ఎన్నారై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు ముందుకు వచ్చాడని ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే అది కూడా ఇంకా కన్‌ఫర్మ్ కాలేదు. నిర్మాత ఎవరో కన్‌ఫర్మ్ కాకపోయినప్పటికీ ఈ సినిమాని 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. శంకర్ సన్నిహితుల కథనం ప్రకారం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్‌లో వుందని, దీనికి 350 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందని శంకర్ అంచనా వేశాడని తెలుస్తోంది. ఇండియాలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని నిర్మించే ఆ శ్రీమంతుడు ఎవరో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.!