ఎన్‌టివి ఛానల్‌లో మామామియా అనే ప్రోగ్రామ్ గురించి తెలియని వారుండరు. ఎవరో ఒక సెలబ్రిటీకి సంబంధించి వ్యంగ్యంగా కామెంట్ చేస్తూ సాగే ఈ ప్రోగ్రామ్ వల్ల ఇప్పుడు ఎన్‌టివి చట్టపరమైన సమస్య తెచ్చుకుంది. ఇటీవల ఎంఎస్‌జి2 ది మెసెంజర్ పేరుతో తెలుగులో విడుదలైన బాలీవుడ్ చిత్రానికి సంబంధించి ఈ ఛానల్ చేసిన మామామియా ప్రోగ్రామ్ ఆ సినిమా టీమ్‌ని, ఆ సినిమాలో హీరోగా నటించిన బాబా గుర్మీత్ రామ్‌రహీమ్ సింగ్ ఫాలోవర్స్‌ని హర్ట్ చేసింది. అంతటితో ఆగని ఎన్‌టివి ఆ ప్రోగ్రామ్‌ని యూ ట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేశారు. ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా వ్యహరించిన బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కి ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ఫాలోయింగ్ వుంది. రాజస్థాన్‌కి చెందిన గుర్మీత్ దేరా సచ్చా సౌదా అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి దాని ద్వారా హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీలు ప్రారంభించి పేదవారికి ఉచితంగా సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు. ఉత్తర భారతదేశంలో విపరీతమైన ఫాలోయింగ్ వున్న గుర్మీత్ తను చెప్పాలనుకున్న మంచి మాటల్ని ఒక సభలో చెప్పడం కంటే సినిమా మాధ్యమం ద్వారా చెప్తే అందరికీ చేరుతుందన్న ఉద్దేశంతో తన మొదటి సినిమాని నిర్మించాడు. డ్రగ్స్ వల్ల యువత తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకుంటున్నారన్న అంశాన్ని తీసుకొని సందేశాత్మకంగా ఎంఎస్‌జి చిత్రాన్ని నిర్మించాడు. ఆ సినిమా సూపర్‌హిట్ అవ్వడమే కాకుండా కలెక్షన్లపరంగా రికార్డులు సృష్టించింది. రెండో ప్రయత్నంగా ఎంఎస్‌జి2 చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రంలో మాంసాహారం తినడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనే అంశాన్ని, నాగరిక ప్రపంచానికి దూరంగా అడవుల్లో జీవనం సాగిస్తున్న వారికి నాగరికతను నేర్పించి వారు సాధారణ ప్రజల్లోకి ఎలా తీసుకురావాలి అనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా కూడా హిందీలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి అనువదించి అక్టోబర్ 1న విడుదల చేశారు. అయితే ఎన్‌టివి న్యూస్ ఛానల్ గుర్మీత్ రామ్‌రహీమ్ సింగ్‌ని టార్గెట్ చేస్తూ ఈమధ్య మామామియా ప్రోగ్రామ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుర్మీత్‌ని అసభ్యకరమైన మాటలతో విమర్శించడంతో అతన్ని ఫాలో అవుతున్నవారు మనస్థాపానికి లోనయ్యారట. దీంతో ఎంఎస్‌జి టీమ్ ఎన్‌టివికి లీగల్ నోటీసు పంపింది. తమ గురువు గుర్మీత్ గురించి వ్యంగ్యంగా చేసిన ప్రోగ్రామ్‌ని యూ ట్యూబ్ నుంచి తొలగించాలని, అంతే కాకుండా యూట్యూబ్‌లోనే క్షమాపణ కోరాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. క్షమాపణ కోరుతూ యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే ఆ వీడియో వారం రోజులపాటు వుండేలా చూడాలని ఎన్‌టివికి సూచించారు. మరి దీనిపై ఎన్‌టివి ఎలా స్పందిస్తుంది? ఎంఎస్‌జి టీమ్ కోరినట్టు క్షమాపణ చెప్తుందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే వెయిట్ అండ్ సీ.