రవితేజ కెరీర్‌కు పెద్ద ఊపునిచ్చిన చిత్రం కిక్. ఈ చిత్రంతో రవితేజ మార్కెట్ బాగా పెరిగింది. కానీ ఆ తర్వాత రవితేజ నటించిన ఏ చిత్రం కూడా ఆ స్థాయి విజయాన్ని సాధించలేదు. మధ్యలో బలుపు, పవర్ వంటి విజయాలు వచ్చినా అవి పెద్ద హిట్ చిత్రాలు మాత్రంకావు. కేవలం ఓ మోస్తరు విజయాలు మాత్రమే. దీంతో కిక్ తో తన మార్కెట్‌ను పెంచుకున్న రవితేజ ఆ చిత్రం తర్వాత దాదాపు ఆరేళ్లకు వచ్చిన కిక్2 పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రంతో తాను 50కోట్ల క్లబ్బులో స్థానం సంపాదించడం ఖాయమని భావించాడు. కానీ రవితేజ కెరీర్‌ను ఎక్కడికో తీసుకెళ్లిన దర్శకుడు సురేందర్‌రెడ్డి రవితేజకు మరో పెద్ద హిట్ ఇవ్వడం ఖాయమని అందరూ భావించారు. కానీ కిక్2 మాత్రం డిజాస్టర్‌గా మిగిలి రవితేజ కెరీర్‌పై పెద్ద ఎఫెక్ట్ చూపించింది. దీంతో ఇప్పుడు ఆయన తన ఆశలన్నీ బెంగాల్‌టైగర్ మీద, త్వరలో దిల్‌రాజు బేనర్‌లో వేణుశ్రీరామ్ దర్శకత్వంలో రూపొందే ఎవడో ఒక్కడు పైనే తన ఆశలన్నీ పెట్టుకొని ఉన్నాడు. ఎనర్జిటిక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రవితేజకు ఇప్పుడు యంగ్‌హీరోలైన నితిన్, నాని, రాజ్‌తరుణ్ వంటి వారి నుండి పెద్ద పోటీనే ఎదురుకానుంది. మరి వారిని దాటుకొని తన స్థాయిని మరలా పదిలపరుచుకునే చిత్రం కోసం రవితేజ ఆరాటపడుతున్నాడు. మరి రవితేజ కోరిక ఏ చిత్రంతో తీరుతుందో వేచిచూడాలి..! తనకు పూర్వ వైభవం తెచ్చే సినిమా కోసం రవితేజ తన రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఉదారంగా వ్యవహరిస్తున్నాడు. తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్‌లో సగం ముందుగా ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని సినిమా విడుదలైన తర్వాత ఇచ్చినా ఫర్వాలేదు... అని దర్శకనిర్మాతలకు చెబుతున్నాడు. మరి ఇంతగా పరితపిస్తున్న రవితేజ ఆశలు నెరవేరుతాయా? లేదా? అన్నవిషయం కొద్దిరోజుల్లో తేలనుంది...!