తాము ఏ పాత్ర పోషిస్తే.. ఆ పాత్రకు నిండుదనం తెచ్చి, ఆమె తప్ప మరొకరు ఆ పాత్రను చేయలేరనే విధంగా పేరుతెచ్చుకొని పాత్రలో పరకాయ ప్రవేశం చేసే నటీనటులు కొందరు మాత్రమే ఉంటారు. అందులో రమ్యకృష్ణ ఒకరు. ఆమె ఏ పాత్ర చేసినా దాన్నో చాలెంజ్‌గా తీసుకుంటుంది, అప్పుడెప్పుడో వచ్చిన నరసింహ నుండి ఇటీవల విడుదలైన బాహుబలిలోని రాజమాత శివగామి పాత్ర వరకు ఆమె తప్ప మరెవ్వరూ చేయలేరనే గుర్తింపు తెచ్చిన చిత్రాలు చాలానే ఉన్నాయి. కాగా త్వరలో క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా క్రికెట్‌లోని మ్యాచ్‌ఫిక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు సానా యాదిరెడ్డి. ఆయన ఈ చిత్రాన్ని దక్షిణాదిలోని అన్నిభాషల్లో ఒకేసారి తెరకెక్కించనున్నాడు. సౌత్‌లోని అన్ని భాషల్లో రమ్యకృష్ణకు క్రేజ్ ఉండటం, దానికి తోడు బాలీవుడ్‌లో కూడా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో ఆమె ఇమేజ్ ఈసినిమాకు మరింత హైలైట్ అవుతుందని దర్శకనిర్మాత బావిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీశాంత్ తల్లి పాత్ర చాలా కీలకం కావడంతో మంచి రెమ్యూనరేషన్ ఇచ్చిమరీ ఆమెను తీసుకున్నారట. మరి నటనలో ఓనమాలు కూడా రాని శ్రీశాంత్, నటనలో శివమెత్తిపోయే రమ్యకృష్ణ ముందు నిలబడగలడా? లేక ఆమె ముందు తేలిపోతాడా? అనేది వేచిచూడాల్సివుంది..!