ఓ హీరో అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ చూరగొంటేనే అతనికి స్టార్ వాల్యూ ఎప్పటికీ నిలిచివుంటుంది. మరీ ముఖ్యంగా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు చిన్నారులను ఆకట్టుకునే సినిమాలు చేస్తే ఇక ఆ హీరోగా స్టార్‌డమ్‌కు తిరుగుండదు. ఈవిషయంలో తమిళ స్టార్, ఇళయదళపతి విజయ్‌ని ఎంతైనా మెచ్చుకోవాల్సిందే. కోలీవుడ్‌లో రజనీకాంత్ తర్వాతి స్థానం కోసం అజిత్, విజయ్‌ల మధ్య టగ్ ఆఫ్ వార్ జరుగుతోంది. దీంతో విజయ్ తన చిత్రాలన్నింటిని క్లీన్ ఎంటర్‌టైనర్స్‌గా మలిచేందుకు ఎంతో కేర్ తీసుకుంటున్నాడు. ఇటీవలకాలంలో విజయ్ నటించిన వరుసగా తొమ్మిది చిత్రాలు సెన్సార్ నుండి క్లీన్ యు తెచ్చుకోవడం బట్టి చూస్తే విజయ్ ఈ విషయంలో ఎంత కేర్ తీసుకుంటోంది అందరికీ అర్థం అవుతుంది. తాజాగా ఆయన నటిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం పులి సైతం క్లీన్ యు సర్టిఫికేట్ సాదించింది. అంతేకాదు... ఈచిత్రం కేవలం తన అభిమానులనే కాకుండా అందరినీ అలరించేలా ఉండేందుకు... మరీముఖ్యంగా చిన్నారులను అలరింపజేసేవిధంగా రూపుదిద్దుకొందని సమాచారం. ఈ చిత్రం కనుక తమిళంలో పెద్ద హిట్ అయిన పక్షంలో ఇక అజిత్‌తో పోరులో విజయ్ ఓ మెట్టుపైకెళతాడు అని కోలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.