కొచ్చాడయాన్, లింగా చిత్రాలతో అభిమానులనే కాదు... నిర్మాతలను, బయ్యర్లను కూడా తీవ్రంగా నిరాశపరిచిన సౌత్‌ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రానికి ఎనిమిది నెలల గ్యాప్ తీసుకొని రంజిత్ అనే కుర్రడైరెక్టర్‌ను ఎంచుకోవడంతో ఆయన అభిమానులతో పాటు కోలీవుడ్ పరిశ్రమ కూడా ఈ కబాలి చిత్రాన్ని లైట్ తీసుకున్నాయి. ఈ చిత్రం ఓపెనింగ్ వినాయకచవితికి ప్రారంభమైన సందర్బంగా విడుదల చేసిన ఈ కబాలి ఫస్ట్‌లుక్స్ చూసి రజనీ అభిమానులు కానివారు కూడా వావ్.. అంటున్నారు. 65ఏళ్ల వయసు ఉన్న రజనీని ఈ పోస్టర్స్‌లో చూస్తే ఆయన స్టైల్ చూసిన వారు 25ఏళ్ల వయసులో ఎలాంటి స్టైల్‌ను చూపించాడో ఈ వయసులోనూ ఆయన అదే స్టైల్‌ని చూపించాడని అంటున్నారు. చూడటానికి తెల్లగడ్డం, నెరిసిన జుట్టుతో ఉన్నప్పటికీ ఆయన స్టైల్ మాత్రం అత్యద్భుతం అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. రాధికాఆప్టే ఓ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో కబలేశ్వరన్ అనే ఓ మాఫియా డాన్ పాత్ర రజనీ పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కేవలం మూడునెలల్లోనే పూర్తిచేయాలని రజనీ సంకల్పం. ఈ చిత్రానికి సంబంధించిన 220 పేజీల బౌండెడ్ స్క్రిప్ట్‌ను రజనీ కేవలం ఒకే రోజులో చదివి, ఆ పక్క రోజే ఈ చిత్రం గురించిన కొన్ని అంశాల గురించి డైరెక్టర్ రంజిత్‌తో చర్చించాడట. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ రంజిత్ తెలిపాడు. వాస్తవానికి అంతటి స్క్రిప్ట్‌ను పూర్తిగా క్షుణ్ణంగా చదవి అర్దం చేసుకోవడానికి కనీసం ఓ వారం పడుతుందని రంజిత్ భావించాడట. కానీ ఒకే ఒక్క రోజులో ఈ స్క్రిప్ట్‌ను చదివి మార్పులు చేర్పులు చెప్పడం చూసి, 65ఏళ్ల వయసులో కూడా అంత ధారణశక్తి, జ్ఞాపకశక్తిని చూసి తాను ఆశ్చర్యపడిపోయానని రంజిత్ మీడియాకు తెలిపాడు.