అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న హిస్టారికల్ మూవీ రుద్రమదేవి. ఈ చిత్రాన్ని గుణశేఖర్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. వాస్తవానికి ఈ చిత్రాన్ని బాహుబలి కంటే ముందే విడుదల చేయాలని భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ చిత్రం తర్వాత అనుష్క ప్రధానపాత్ర పోషిస్తున్న సైజ్‌జీరో చిత్రం ప్రారంభమైంది.
కానీ ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైనా కూడా ఇంకా రుద్రమదేవి సినిమా విడుదల కాలేదు. దాంతో ఈ రెండు చిత్రాలు చాలా తక్కువ గ్యాప్‌లో విడుదలయ్యే పరిస్థితి ఏర్పడింది. రుద్రమదేవి తర్వాత సైజ్‌జీరో వస్తే అది తనకు, నిర్మాతలకు బిజినెస్‌పరంగా కలిసొస్తుందని ఆశించిన అనుష్కకు రుద్రమదేవి వాయిదాలు పడటం చికాకును కలిగిస్తోందిట. అక్టోబర్ 2న సైజ్‌జీరో సినిమాను విడుదల చేయాలని భావించిన పివిపి సంస్థ.. అక్టోబర్ 9న రుద్రమదేవి విడుదల అవుతుందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకొని తమ చిత్రాన్ని వాయిదా వేసుకొన్నట్లు సమాచారం. మరి రుద్రమదేవి అక్టోబర్ 9 వతేదీన అయినా విడుదల అవుతుందో లేదో చూడాల్సివుంది...! ఇక సైజ్‌జీరో విషయానికి వస్తే ఇందులో లడ్డూబామగా కనిపిస్తున్న అనుష్కను చూసి చాలామంది ఇది ఫేక్ అంటున్నారు. కానీ ఈ విషయంపై అనుష్క స్పందించింది. నేను లావుగా కనిపిస్తున్న లుక్ ఫేక్ కాదు. ఆ సినిమా కోసం నేను కార్బొహైడ్రేట్స్ తీసుకొని లావుగా తయారయ్యాను. సైజ్‌జీరో చిత్రంలో ఆమె లావుగా కనపడటం అబద్దమని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఇలా స్పందించింది. 17కిలోలు బరువు ఆమె ఈ సినిమా కోసం పెరిగిందట. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆర్య, సోనాల్‌చౌహాన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.