పరభాషలో ఓ చిత్రం మంచి విజయం సాదిస్తే ఇక మన సినిమా వాళ్లకు పండగే అని చెప్పవచ్చు. ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలని నిర్మాతలు, దర్శకులే కాదు..ఆ చిత్రంలో నటించాలని మన స్టార్‌హీరోలు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల తమిళంలో విడుదలైన తని ఒరువన్ చిత్రం అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంటోంది. ఈ చిత్రాన్ని తెలుగులో చేయడానికి రామ్‌చరణ్‌తో పాటు మరో ఇద్దరు స్టార్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రంలో జయం రవి హీరోగా నటించగా ఆయన సోదరుడు జయం రాజా దర్శకత్వం వహించాడు. చాలాకాలం తర్వాత ఈ చిత్రంలో అరవింద్‌స్వామి నటించాడు. ఆయన ఇందులో విలన్ పాత్రను పోషించారు. కాగా ఈచిత్రం స్పెషల్ షో చూసిన బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ ఈ చిత్రం రీమేక్‌లో నటించడానికి అప్పుడే ఓకే చెప్పేశాడు. సల్మాన్ కోసం చిత్రంలో కొన్ని మార్పులు చేస్తానని జయం రాజా ప్రకటించాడు. ఈ చిత్రం బాలీవుడ్ రీమేక్‌కు కూడా జయం రాజా దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇందులో హీరో పాత్ర పోలీస్ కావడంతో జంజీర్ (తుఫాన్)లో పోలీస్ పాత్ర పోషించి విఫలమైన రామ్‌చరణ్ ఈ చిత్రం రీమేక్‌లో నటించి పోలీస్ పాత్రతో హిట్ కొట్టాలని తాపత్రయపడుతున్నాడు. కానీ ఈ చిత్రం ఏ నిర్మాత, హీరోల చేతికి అందుతుంది అనేది ఎడిటర్ మోహన్ నిర్ణయంపై ఆధారపడి ఉందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రం రైట్స్‌ను పొందాలని సూపర్‌గుడ్ ఫిలింస్‌తో పాటు ఠాగూర్ మధు పోటీలో ఉన్నాడట.