మీడియా అత్యుత్సాహం వల్ల ఒక బ్రిటీష్ యువరాణి ప్రాణాలు కోల్పోయిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ స్థాయిలో అలాంటి భారీ తప్పిదాలు మీడియా వల్ల జరగలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఒక ఫేక్ న్యూస్‌తో అంతర్జాతీయ మీడియా అభాసు పాలైంది. ప్రపంచ వీరుడు అర్నాల్డ్ ష్వార్జెనెగర్ హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడని, ఆయన మృతిని పోలీసులు, కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించారని కొన్ని టి.వి. ఛానల్స్ వేడి వేడిగా ఈ వార్తను ప్రసారం చేసాయి. నిజమా? కాదా? అని క్రాస్ చెక్ చేసుకోకుండా మిగతా టి.వి. ఛానల్స్ కూడా వారిని అనుసరించారు. ఆఖరికి మన తెలుగు న్యూస్ ఛానల్స్‌లో కూడా ఆ వార్తను హైలైట్ చేస్తూ తమ సంతాపాన్ని కూడా తెలియజేసాయి. పనిలో పనిగా దేశవ్యాప్తంగా వున్న వెబ్‌సైట్లు.. అన్నీ కాకపోయినా కొన్ని అర్నాల్డ్ మరణ వార్తను రాసాయి.
అర్నాల్డ్ మరణ వార్త అబద్ధమని, అర్నాల్డ్ పూర్తి ఆరోగ్యంతో వున్నాడని, ఈ విషయంలో మీడియా అత్యుత్సాహం చూపిందని అతని సన్నిహితులు చెప్తున్నారు. ఆయన మరణవార్త తెలిసి ప్రపంచ వ్యాప్తంగా వున్న అభిమానులు ఆందోళన చెందారని, ఇలాంటి వార్తలు నమ్మవద్దని అభిమానుల్ని కోరారు అర్నాల్డ్ సన్నిహితులు.
సెలబ్రిటీల మరణ వార్తల్ని ముందు తమ ఛానలే టెలికాస్ట్ చెయ్యాలన్న ఉత్సాహం తెలుగు న్యూస్ ఛానల్స్‌లో కూడా ఎక్కువే. అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరగానే ఎప్పుడు మరణవార్త వస్తుందోనని స్టోరీ రెడీ చేసుకొని పెట్టుకునే వారు మన దగ్గరా వున్నారు. ఆ సెలబ్రిటీలకు ట్రీట్‌మెంట్ జరుగుతుండగానే మరణించారన్న న్యూస్ వేసి సంతాపం తెలిపిన సందర్భాలు కూడా వున్నాయి. ఏది ఏమైనా మరణ వార్తను కూడా అందరి కంటే ముందు వెయ్యాలని ఫేక్ న్యూస్‌లు ప్రజల్లోకి తీసుకెళ్లడం మాత్రం మీడియాకు ఆరోగ్యమనిపించుకోదు.