నవ్యమైన కథ, కథనాలతో కొత్త దర్శకులను పరిచయం చేస్తూ ఆర్య, బొమ్మరిల్లు, కొత్తబంగారులోకం, బృందావనం వంటి హృదయాన్ని హత్తుకునే చిత్రాలను నిర్మించిన దిల్ రాజు ఆ తర్వాత పెద్ద హీరోల మోజులో పడి మున్నా, రభస, రామయ్యా వస్తావయ్యా, ఓ మైఫ్రెండ్, జోష్ వంటి ఫెయిల్యూర్స్‌ను మూటగట్టుకున్నాడు. ఒకేసారి నాలుగైదు ప్రాజెక్టులు అనౌన్స్ చేసి.. ఒకేసారి షూటింగ్‌లు చేసి తీవ్రమైన ఒత్తిడి గురవ్వడం, ఏ చిత్రానికి సరైన సమయాన్ని కేటాయించకపోవడం వల్లే అందుకు కారణమని అప్పట్లో దిల్‌రాజే బాహటంగా చెప్పాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎవడు చిత్రాల సమయంలో ఇక నుంచి ఒకదాని తర్వాత ఒక సినిమా మాత్రమే చేస్తానని చెప్పిన అన్నట్లుగానే నూతన తారలతో, చిన్నబడ్జెట్‌లో ‘కేరింత’ చిత్రాన్ని తీసి మళ్ళీ తొలిరోజుల తరహాలోనే ఓ అందమైన విజయాన్ని దక్కించుకున్నాడు. ఇక రాజు ట్రాక్‌లో పడ్డాడు అనుకుంటున్న సమయంలోనే దిల్‌రాజు మళ్ళీ ఒకేసారి నాలుగు సినిమాలు అనౌన్స్ చేసి మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతున్నాడని అంటున్నారు సినీజనాలు. ప్రస్తుతం సాయిధరమ్‌తేజ్‌తో సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దిల్‌రాజు ఈ హీరోతోనే అనిల్ రావిపూడి దర్శకత్వంతో ఓ సినిమా చేస్తానని ప్రకటించాడు. అంతేకాదు ప్రస్తుతం సునీల్‌తో ఆయన చేస్తున్న ‘కృష్ణాష్టమి’తో పాటు మరో రెండు చిత్రాలు, అందులో ఒకటి పవన్‌కళ్యాణ్‌తో కూడా వుంటుందని అంటున్నారు. సో.. దిల్ రాజు మళ్లీ ట్రాక్ తప్పుతున్నాడని అతని శ్రేయోభిలాషులు ఆందోళన చెందుతున్నారు.
Advertisement
CJ Advs