ఈ మధ్యకాలంలో మన హీరోలందరూ ఒక్కొక్కరుచొప్పున ఓన్ ప్రొడక్షన్ హౌజ్‌లను నెలకొల్పి నిర్మాతల అవతారం ఎత్తుతున్నారు. మనతో పాటు కొందరు తమిళ హీరోలు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. అయితే ఈ పని ఓ విధంగా మంచికే ఉపయోగపడుతోంది. హీరోలు తమ తమ చిత్రాల బడ్జెట్‌ను నియంత్రించడంలో ఇది కీలకపాత్రను పోషిస్తోంది. ఇప్పటికే నందమూరి కళ్యాణ్‌రామ్, నితిన్‌లు నిర్మాతలుగా బిజీగా ఉన్నారు. పవన్‌కళ్యాణ్ విషయానికి వస్తే మరలా చాలా కాలం తర్వాత ఆయన 'సర్దార్ గబ్బర్‌సింగ్' చిత్రంతో తన పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌ను ఈ చిత్రానికి భాగస్వామిని చేశాడు. మహేష్‌బాబు కూడా నిర్మాతగా మారి సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పి 'శ్రీమంతుడు'కు సహ నిర్మాతగా వ్యవహరించాడు. త్వరలో ప్రారంభం కానున్న 'బ్రహ్మూెత్సవం' చిత్రాన్ని కూడా ఆయన పివిపి సంస్థతో కలిసి నిర్మిస్తున్నాడు. ఇక తమిళంలో కమల్‌హాసన్, విశాల్, సూర్య వంటి హీరోలు నిర్మాతలుగా దూసుకువెళ్తున్నారు. తెలుగులో కూడా సీనియర్ హీరోలైన నాగార్జున, వెంకటేష్ వంటి వారికి సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య కూడా ప్రొడక్షన్ వ్యవహారాలు నేర్చుకుంటున్నాడు. సో..రాబోయే కాలంలో ప్రతి హీరో తనకంటూ ఓ సొంత నిర్మాణసంస్థను స్థాపించడం ఖాయమనే అనిపిస్తోంది.