ఒక్కో హీరోకి ఒక్కో సెంటిమెంట్ వుంటుంది. తను నటించిన సంక్రాంతికి రిలీజ్ అయితే హిట్ అవుతుందని లేదా సమ్మర్‌లో రిలీజ్ చేస్తే రికార్డులు క్రియేట్ చేస్తుందని.. ఇలా రకరకాల సెంటిమెంట్స్‌తో తమ తమ సినిమాలను రిలీజ్ చేస్తూ వుంటారు. ఈ విషయంలో సంక్రాంతికి చాలా స్పెషాలిటీ వుంది. చాలా మంది హీరోల సినిమాలు సంక్రాంతి రిలీజ్ అయి పెద్ద విజయం సాధించాయి. ఈ సెంటిమెంట్ బాలకృష్ణకి గతంలో బాగా వర్కవుట్ అయింది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ వంటి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయి సంచలన విజయాలు సాధించాయి. ఆ సినిమాల తర్వాత ఆ సెంటిమెంట్ అంతగా వర్కవుట్ కానప్పటికీ మరోసారి సంక్రాంతికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు బాలయ్య. శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'డిక్టేటర్' చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.
ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్‌లో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం జనవరి 8న రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు. పవన్‌కళ్యాణ్ లేటెస్ట్ మూవీ సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రాన్ని కూడా సంక్రాంతికే రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అంటే ఈ సంక్రాంతి బరిలో ముగ్గురు హీరోలు వున్నారన్నమాట. మరి ఎవరిని విజయం వరిస్తుంది? లేక ముగ్గురు హీరోల సినిమాలూ సూపర్‌హిట్ టాక్ తెచ్చుకొని కాసుల వర్షం కురిపిస్తాయా? అనేది తెలుసుకోవాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.!