పెరిగిన థియేటర్ల రేట్లతో పాటు 'బాహుబలి' సృష్టించిన ప్రభంజనం చూసిన తర్వాత తెలుగు సినిమా రేంజ్ బాగా పెరిగినట్లు అర్థం అవుతోంది. ఒకేసారి తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేయడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో 'బాహుబలి' నిరూపించింది. అదే నమ్మకంతో మహేష్‌బాబు కూడా తన 'శ్రీమంతుడు' చిత్రాన్ని ఒకేసారి తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ చేశాడు. ఈ చిత్రం దాదాపు 100కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారంటే అది ' బాహుబలి' పుణ్యమే అంటున్నారు. ఈ విధంగా 'బాహుబలి, శ్రీమంతుడు' చిత్రాలు తెలుగు సినిమా స్థాయిని పెంచడంతో ఆ ఎఫెక్ట్ తమ 'రుద్రమదేవి'కి కూడా అచ్చివస్తుందని గుణశేఖర్ నమ్మకంగా ఉన్నాడు. గుణశేఖర్ స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో రూపొందించిన 'రుద్రమదేవి' చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రాన్ని కూడా ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. 'బాహుబలి, శ్రీమంతుడు' లకు అచ్చి వచ్చిన విధానం తనకు కూడా కలిసి వస్తే తాను పెట్టిన పెట్టుబడి 70కోట్లతో పాటు మరింత వసూలు చేసి, తనకు లాభాలను తీసుకురావడం ఖాయం అనే నమ్మకంతో గుణశేఖర్ ఉన్నాడు.