ఒక సినిమా సక్సెస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఎంతటి ప్రధాన పాత్రను పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇటీవల విడుదలై సక్సెస్ సాధించిన బాహుబలి, శ్రీమంతుడు చిత్రాలు మాత్రం ఇందుకు మినహాయింపుగా చెప్పుకోవాలి. ఎటువంటి ఎంటర్‌టైన్‌మెంట్ లేకుండానే ఈ రెండు చిత్రాలు ఘనవిజయాలు సాధించాయి. అయితే ఎంటర్‌టైన్‌మెంట్ అంటే కేవలం నవ్వించడమే కాదని, ఎమోషన్స్, సెంటిమెంట్, గ్రాఫీక్స్ కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌లో భాగమేనని సదరు మేధావులు వాదించినా.. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం కడుపుబ్బ నవ్వించడమేననేది సగటు ప్రేక్షకుల వాదన..సో..ఇది ఎలా వున్నా.. ఇటీవల విడుదలైన శ్రీమంతుడులో ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గిందనేది కాదనలేని వాస్తవం. అందుకే ఈ చిత్రం వినోదాన్ని కోరుకునే హాస్యప్రియులకు పూర్తిగా రుచించలేదని అంటున్నారు. అయితే ఇదే విషయాన్ని శ్రీమంతుడు దర్శకుడిని ప్రశ్నిస్తే కేవలం ఒక్క శాతం ప్రేక్షకులకు మాత్రమే ఈ విషయంలో అసంతృప్తిగా వున్నారని, మిగిలిన 99 శాతం మందిని అంసతృప్తి గురిచేయడం తగదని అనుకున్నానని, అందుకే కథకు అనవసరమైన కామెడీని పెట్టలేదని చెప్పుకోచ్చాడు.