రచయితగా సుపరిచితుడైన కొరటాల శివ ‘మిర్చి’ చిత్రంతో దర్శకుడిగా మారాడు. తొలిచిత్రంతో సూపర్‌హిట్‌ను అందుకున్న అయిన ద్వితియ ప్రయత్నం ‘శ్రీమంతుడు’తో కూడా సూపర్‌సక్సెస్‌ను అందుకున్నాడు. అయితే తాను దర్శకుడిగా మారడానికి కారణం తన దగ్గర కథలు తీసుకున్న దర్శకులు సరైన గుర్తింపు ఇవ్వకపోవడమేనని ఆవేదన వ్యక్తం చేశాడు కొరటాల శివ. మీలా రచయితలంతా దర్శకులైతే తెలుగు సినీ పరిశ్రమలో కథల కొరత వుంటుంది కదా? అనే ప్రశ్నకు సమాధానంగా కొరటాల శివ మాట్లాడుతూ ‘రచయితల కొరతపై అగ్ర కథానాయకులు, నిర్మాతలు, సినీ మేధావులు నిర్ణయం తీసుకోవాలి. సేవ్ టైగర్స్ మాదిరిగానే సేవ్ రైటర్స్ అనే నినాదం వెలుగులోకి రావాలి. టైగర్స్ లాంటివారే రైటర్స్ అని వారు భావించాలి. రచయితలు కొరతకు కారణం ఏమిటనే విషయంపై అందరూ ఆలోచించాలి.
రచయితల కొరతకు ప్రధాన కారణం వారికి రావాల్సిన గుర్తింపు, డబ్బు రావడం లేదు. వారి సృజనాత్మకతను దొంగతనం చేస్తున్నారు. బ్యాంకులు దోపీడి చేసే వాడికి, అమ్మాయిలను రేప్ చేసేవాడికి, రచయితల కథలు దొంగతనం చేసే వాడికి పెద్దగా తేడా ఉండదని నా ఫీలింగ్. డబ్బుతో పాటు రచయితలకు గుర్తింపు ఇవ్వాలి. ఈ కథ బాగారాశారు అని చెప్పాలి. ఈ పరిస్థితుల్లో మార్పు రానందు వల్లే ఇంతకు ముందు గదిలో కూర్చొని బాధపడ్డ రచయితలందరూ ఇప్పుడు దర్శకులతువున్నారు. ఇక మిగిలిన రచయితల్ని కాపాడుకోవాలంటే ఇప్పటికైనా ఈ విధానంలో మార్పు రావాలి’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే శివ ఇంత ఘాటుగా స్పందించడానికి కారణం తన స్వీయానుభవమేనని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకు ముందు శివ... భద్ర, తులసి, సింహా, బృందావనం చిత్రాలకు రచయితగా పనిచేశాడు... సో.. ఇక శివను మోసం చేసిన దర్శకుడు ఎవరో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కదా!.