ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' చిత్రం ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. సౌతిండియా నుండి 500కోట్లు వసూలు చేసిన చిత్రంగా ఇది రికార్డులకెక్కింది. ఇండియన్ సినీ చరిత్రలో 'బాహుబలి' ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా పుణ్యమా అని ప్రభాస్ దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్ అయ్యాడు. పలు కార్పొరేట్ కంపెనీల దృష్టి కూడా ప్రభాస్ వైపు మళ్లింది. ఇప్పటికే ఓ సాఫ్ట్ డ్రింక్ కంపెనీతో పాటు, ఓ టూత్‌పేస్ట్ కంపెనీ సైతం ప్రభాస్‌తో సంప్రదింపులు జరిపాయి. తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన్ను నియమించుకొనేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. 'బాహుబలి' పార్ట్ 2 తెరకెక్కుతోన్న ఈ నేపథ్యంలో ప్రభాస్‌తో అయితే యాడ్ ఫిల్మ్స్ చేస్తే బాగా వర్కౌట్ అవుతుందని పలు కార్పొరేట్ కంపెనీలు భావిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ప్రభాస్ ఇంకా ఏ కంపెనీకి ఓకే చెప్పలేదని సమాచారం. త్వరలో ఈ విషయం తేలనుంది. ఇప్పటికే తెలుగు మార్కెట్‌లో యాడ్స్ పరంగా మహేష్‌బాబు టాప్‌లో ఉన్నాడు. అయితే ఆయన చాలా కాస్ట్లీ యాక్టర్ కావడం, ఇప్పటికే ఆయన బోలెడు ఉత్పత్తులకు ప్రచారం చేస్తున్నాడు. ఇక పవన్‌కి యాడ్స్ చేసే ఉద్దేశ్యంలేదు. రామ్‌చరణ్,అల్లుఅర్జున్, ఎన్టీఆర్‌లు ఇప్పటికే యాడ్స్ చేస్తున్నప్పటికీ వారి ఇమేజ్ ఎక్కువగా కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అవుతోంది. అందుకే పలు కంపెనీలు 'బాహుబలి'కి ఏర్పడిన క్రేజ్‌తో ప్రభాస్ వైపే మొగ్గుచూపుతున్నాయని, దీంతో రాబోయే కాలంలో మహేష్‌కి ధీటుగా ఈ యాడ్ మార్కెట్‌లో ప్రభాస్ కూడా సంచలనాలను నమోదు చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.