'నాకు నచ్చిన సినిమాల నుంచి కాపీ కొడతాను' అంటూ ధైర్యంగా చెప్తాడు రామ్‌గోపాల్‌వర్మ. అలా చెప్పడం అందరి వల్ల కాకపోవచ్చు. కానీ, కాపీ కొట్టడం మాత్రం చాలా మంది డైరెక్టర్లలో కామన్‌గా కనిపించే విషయం. ఒక సూపర్‌హిట్ సినిమా వచ్చిందంటే అది ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అని తెలిసిపోతుంది. అయితే ఆ సినిమా తనకు ఇన్‌స్పిరేషన్ అని చెప్తాడు సదరు డైరెక్టర్. ఇప్పటివరకు ఇండియాలో వచ్చిన చాలా సినిమాలకు హాలీవుడ్ సినిమాలు, కొరియన్ సినిమాలు ఇన్‌స్పిరేషన్ అయ్యాయి. ఈ విషయం పక్కన పెడితే ఒక భాష సినిమాను కాపీ చేసి మళ్ళీ అదే భాషలో తీసి సూపర్‌హిట్ కొట్టిన వైనం మీకు తెలుసా? అది తమిళ ఇండస్ట్రీలో జరిగింది. 1978లో వచ్చిన 'ఆయిరం జన్మంగళ్' అనే తమిళ సినిమాని సీన్ టు సీన్ కాపీ కొట్టి 'అరన్మయి' అనే చిత్రాన్ని తీశాడు డైరెక్టర్ సుందర్ సి. ఈ చిత్రమే తెలుగులో 'చంద్రకళ'గా రిలీజ్ అయి ఇక్కడ కూడా భారీగా కలెక్ట్ చేసింది. విజయకుమార్, లత, రజనీకాంత్ నటించిన 'ఆయిరం జన్మంగళ్' చిత్రం అప్పట్లో సూపర్‌హిట్ అయింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు సుందర్ సి. దాన్ని కాపీ చేసి 'అరన్మయి' చిత్రాన్ని తీశారని కోర్టుకెక్కారు ఆ చిత్ర నిర్మాతలు. కేసును పరిశీలించిన కోర్టు ఈ రెండు సినిమాలను చూసి ఫైనల్‌గా 'అరన్మయి' కాపీ చిత్రమని తేల్చారు. 'అరన్మయి' తమిళ్‌లో 45 కోట్లు కలెక్ట్ చేసిందని పబ్లిసిటీ చేసుకున్న నిర్మాతలు ఇప్పుడు దిక్కు తోచని పరిస్థితుల్లో పడ్డారు. ఎందుకంటే ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో లెక్కలు కోర్టుకు సమర్పించాలని, దాన్ని బట్టి 'ఆయిరం జన్మంగళ్' నిర్మాతలకు అందులో ఎంత చెల్లించాలనేది నిర్ణయిస్తామని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. దీనికి 'అరన్మయి' నిర్మాతలు ఎలా స్పందిస్తారో, ఎంత చెల్లిస్తారో తెలుసుకోవాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.