ఇటీవల ‘బాహుబలి’ సినిమా విడుదలకు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమౌళి జర్నలిస్ట్‌తో గొడవ పడ్డ సంగతి తెలిసిందే. పైరసీ విషయంలో పాత్రికేయులు వేసిన ప్రశ్నలతో విభేదించిన రాజమౌళి ఓ క్రమంలో సహనం కోల్పోయాడు. అయితే అల్లు అరవింద్ కల్పించుకొని గొడవ సద్దుమణిగేలా చేశారు. ‘బాహుబలి’ సినిమా విడుదలైన సందర్బంగా శుక్రవారం ఉదయం కూకట్‌పల్లిలో సినిమా చూసేందుకు దర్శకుడు రాజమౌళి, హీరోయిన్ అనుష్క, ‘బాహుబలి’ కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తదితరులు వచ్చారు. సినిమా చూసిన అనంతరం మీడియా ప్రతినిధులు రాజమౌళి ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించారు. గత అనుభవం దృష్ట్యా మీడియాకు వీలైనంత దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆయన మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఇప్పుడు నేనేమీ మాట్లాడను అంటూ అందరికీ నమస్కారం పెట్టి అక్కడ నుండి వెళ్లిపోయారు. ‘బాహుబలి’ సినిమాకు మంచి టాక్ వచ్చిందని భావిస్తున్న ఆయన త్వరలో తన టీంతో కలిసి సక్సెస్‌మీట్ పెట్టి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
'బాహుబలి'తో దిల్ రాజు ఏం సాధించాడు!
తెలుగు సినీ ప్రేక్షకలోకం అంతా ప్రస్తుతం ‘బాహుబలి’ మేనియాలో మునిగిపోయారు. గతవారం రోజులుగా ఈ సినిమా టిక్కెట్ల కోసం జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. తాజాగా ‘బాహుబలి’ సినిమా మేనియా పొలిటీషియన్స్‌ను కూడా తాకింది. ఇండియన్ సినీ పరిశ్రమ గర్వించేలా ఈ సినిమా తీయడమే ఇందుకు కారణం. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా ‘బాహుబలి’ సినిమా చూడాలని డిసైడ్ అయ్యాడు. నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు ఆయన కోసం జూలై 11వ తేదీ రాత్రి ప్రత్యేక షో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ షోకు కేసీఆర్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి షో వేయడం ద్వారా తెలంగాణకు చెందిన పలువురు రాజకీయనాయకులతో పరిచయం పెంచుకోవడమే దిల్‌రాజు ముందున్న ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. కాగా ‘బాహుబలి’ చిత్రాన్ని చూసిన అభిమానులు అద్భుతం అంటుంటే క్రిటిక్స్ నుండి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. అయితే సినిమాను తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉందని, గ్రాండ్ లుక్ ఉందని, హాలీవుడ్ స్థాయిలో సినిమా ఉందని అందరూ ఒప్పుకొంటున్నారు.