'బాహుబలి' కోసం ప్రభాస్ రెండేళ్లపాటు అలుపెరగని యోధుడిలా పోరాటం జరిపారు. ఇప్పటికి ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక దాదాపు రెండున్నరేళ్లుగా ప్రేక్షకులకు కనిపించని ప్రభాస్ ఇకపై తన సినిమాల జోరు పెంచాలని చూస్తున్నాడు. అయితే 'బాహుబలి' తర్వాత ప్రభాస్ ఏ చిత్రం మొదలుపెట్టనున్నారో తెలియక ఆయన అభిమానులు అయోమయానికి గురవుతున్నారు.
మొదట బాహుబలి తర్వాత ప్రభాస్ తన పెద్దనాన్న కృష్ణంరాజు దర్శకత్వంలో హీరోగా నటిస్తారనే ప్రచారం జరిగింది. కాని ఆ ప్రాజెక్టు అలా ప్రచారాలకే పరిమితమైంది. ఆ తర్వాత 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ చిత్రం ఓకే అయ్యింది. అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుందనే విషయంలో క్లారిటీ లేదు. ఇక తాజాగా శ్రీనువైట్ల పేరు తెరమీదకు వచ్చింది. ఆయన దర్శకత్వంలో ఓ చిత్రంలో ప్రభాస్ నటించడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే రామ్‌చరణ్‌తో సినిమా రూపొందిస్తున్న శ్రీనువైట్ల ఇక ప్రభాస్ చిత్రానికి రెడీ కావడానికి కొంత సమయమైన పడుతుంది. దీన్నిబట్టి 'బాహుబలి' సినిమా విడుదలైన వెంటనే ప్రభాస్ మరో సినిమా ప్రారంభించే అవకాశాలు మాత్రం కనబడటం లేదు.