తెలుగులో గతంలో ఎన్నడూ లేనంత ప్రతిష్టాత్మకంగా రూపొదిద్దుకుంటున్న చిత్రం 'బాహుబలి'. తిరుపతిలో శనివారం ఈ సినిమా ఆడియోను వేలాది మంది ప్రేక్షకుల నడుమ విడుదల చేసింది జక్కన్న టీమ్. తెలుగులోనే కాకుండా దక్షిణాది, బాలీవుడ్ చిత్రసీమల్లో కూడా 'బాహుబలి' గురించి ఇండస్ట్రీలతోపాటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను కేవలం జక్కన్న సినిమాగా కాకుండా యావత్ తెలుగు సినిమాగా టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రచారం చేసుకుంటోంది. హీరోలు, డైరెక్టర్‌లు తమ వ్యక్తిగత ఇమేజ్‌లను కూడా పక్కకు పెట్టి 'బాహుబలి' గురించి గొప్పగా చెబుతున్నారు. మరి అలాంటి సినిమా ఆడియో విడుదలకు 'బాహుబలి' యూనిట్ తప్పా మరెవరూ హాజరుకాకపోవడం ప్రేక్షకులను విస్మయ పరిచింది.
'బాహుబలి' ఆడియో విడుదలకు సినిమా యూనిట్‌ను పక్కకు పెడితే సురేష్‌బాబు, కృష్ణంరాజులు మాత్రమే ఇండస్ట్రీనుంచి హాజరయ్యారు. తన తనయుడు రానా ఈ సినిమాలో నటిస్తుండటంతో సురేష్‌బాబు ఆడియో విడుదల వేడుకకు హాజరుకాగా ప్రభాస్ కోసం కృష్ణంరాజు వచ్చారు. ఇక మిగిలిన వారికి జక్కన్న ఆహ్వానాలు పంపకపోవడంపై ఇప్పుడు సర్వత్రా చర్చలు కొనసాగుతున్నాయి. 'బాహుబలి'ని తమ సినిమాగా చెప్పుకుంటున్న టాలీవుడ్‌లో కనీసం కొందరు పెద్దలనైనా జక్కన్న ఆడియో విడుదల వేడుకకు ఆహ్వానించి ఉండాల్సిందనేది వీరి వాదన. ఇక జక్కన్న ఆహ్వానం పంపకపోవడంతో ఇండస్ట్రీ పెద్దలు గుస్సాగా ఉన్నట్లు కథనాలు వినబడుతున్నాయి. వీరికోసం మరోసారి ఆడియో విడుద వేడుకను నిర్వహిస్తారన్న ప్రచారం కూడా ఉంది. మరోవైపు 'బాహుబలి' ప్రివ్యూకు సినీ పెద్దలందర్నీ ఆహ్వానించాలన్నది జక్కన్న ఆలోచన కావచ్చనేది మరోవాదన.