ఉన్నట్టుండి షాక్ ఇచ్చేశారు పూరి, నితిన్. `హార్ట్ ఎటాక్` తర్వాత ఇద్దరం కలిసి మరో సినిమా చేస్తున్నామని మొన్ననే ప్రకటించారు. పూరిగారు చెప్పిన కథ అదిరిపోయిందని, హార్ట్ టచింగ్ స్టోరి అని కూడా చెప్పుకొచ్చాడు నితిన్. 15వ తేదీ సినిమాకొ కొబ్బరికాయ కొట్టబోతున్నాం అని ట్విట్టర్లో ప్రకటించేశాడు. అయితే ఇంతలో ఏమైందో ఏంటో కానీ... ఈ కాంబినేషన్ క్యాన్సిల్ అయ్యింది. నితిన్‌తో సినిమా తీయాలనుకొన్నాను కానీ... ఆ ప్లేస్‌లో ఇప్పుడు వేరొక కథానాయకుడొస్తున్నాడని ప్రకటించేశాడు పూరి. అయితే అనుకొన్నట్టుగానే అదే రోజునే సినిమాని మొదలుపెడతామని చెప్పుకొచ్చాడు. నితిన్ కూడా ``కొన్ని అనివార్యకారణాలవల్ల పూరితో సినిమా చేయడం కుదర్లేదు, భవిష్యత్తులో మళ్లీ పూరితో కలిసి సినిమా చేస్తా`` అని ట్వీట్ చేశాడు. ఇంతకీ పూరి నితిన్‌ని తప్పించడం వెనక కారణాలేమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి నితిన్ ప్లేస్‌లో వచ్చే కథానాయకుడు ఎవరో చూడాలి.
Advertisement
CJ Advs