అక్కినేని నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన భక్తి రస చిత్రాలు ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ చిత్రాలు ఎంతటి ప్రేక్షకాదరణ పొందాయో అందరికీ తెలిసిందే. ఒకవిధంగా శ్రీరామదాసు కంటే అన్నమయ్య చిత్రానికే నాగార్జునకు మంచి పేరు వచ్చింది. ఆ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ప్రజాదరణ పొందుతూనే వున్నాయి. ఆ చిత్రంలోని సన్నివేశాలను చూసి ప్రేక్షకులు భక్తి పారవశ్యంలో మునిగిపోతుంటారు. 1997లో అన్నమయ్య చిత్రం విడుదలవగా, 2006లో శ్రీరామదాసు రిలీజ్ అయింది. మళ్ళీ 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. శ్రీరాఘవేంద్ర మూవీ కార్పొరేషన్ పతాకంపై నిర్మాణం జరుపుకోనున్న ఈ చిత్రానికి ‘ఓం నమో వెంటేశాయ’ అనే టైటిల్‌ని రిజిష్టర్ చేశారు. ఈ టైటిల్ విషయంలో కొన్ని తర్జన భర్జనలు జరుగుతున్నప్పటికీ ఇదే టైటిల్ ఫైనల్ అయ్యే అవకాశం వుందని తెలుస్తోంది. అన్నమయ్యలో భక్తుడిగా అందరి మనసులు దోచుకున్న నాగార్జున ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో భగవంతుడిగా భక్తులను ఆకట్టుకోబోతున్నాడు. ఇప్పటివరకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన భక్తి రస చిత్రాల కంటే కథాపరంగా, సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రం వుండబోతోందని తెలుస్తోంది.