ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ అంత వేగంగా సినిమాల చిత్రీకరణ పూర్తి చేసే డైరక్టర్ మరొకరు లేరని చెప్పడానికి ఎలాంటి అనుమానం అక్కరలేదు. ఒక సినిమా పూర్తికాకముందే తదుపరి రెండు మూడు సినిమాలకు కూడా పూరి కమిట్ అయిపోతారు. అంతేకాకుండా మూవీ షూటింగ్ ప్రారంభం రోజునే రిలీజ్ డేట్‌ను కూడా పూరి అనౌన్స్ చేస్తారు. ప్రస్తుతం పూరి దర్శకత్వం వహించిన 'జ్యోతిలక్ష్మీ' విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఆయన తదుపరి చిత్రం ఏ సినిమా అయిఉంటుందని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
చిరంజీవి 150వ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారనే విషయం స్పష్టమైంది. అంతేకాకుండా మహేష్‌బాబుకు ఓ కథ చెప్పి ఓకే అనిపించుకున్న ఈ దర్శకుడు ఆ సినిమాను కూడా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. అయితే ఈ రెండు సినిమాల ప్రారంభానికి ఇంకా సమయం ఉండటంతో అంతలోపు మరోసినిమా చేయాలని పూరి కన్‌ఫర్మ్ అయ్యాడు. నితిన్ హీరోగా పూరి ఓ సినిమా చేయడం కన్‌ఫర్మ్ అయ్యింది. ఈ నెల 15నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవనుంది. 'హార్ట్‌ఎటాక్' తర్వాత పూరి, నితిన్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా తర్వాత పూరి మెగాస్టార్ 150వ సినిమాను మొదలుపెట్టనున్నారు.