సినిమాకి ఎంతవరకు అవసరమో తెలీదుగానీ భారీ సెట్స్ వేయడంలో గుణశేఖర్‌కి సెట్స్ డైరెక్టర్ అని పేరు మాత్రం వుంది. ఈ విషయంలో ఏ నిర్మాత మీదా ఆధారపడకుండా ‘రుద్రమదేవి’ పేరుతో తనే సొంతంగా సినిమాని స్టార్ట్ చేసి ఎన్నో వ్యయప్రయాసల కోర్చి కంప్లీట్ చేశాడు. ఆమధ్య ఫస్ట్‌లుక్ అనీ, ట్రైలర్ అనీ హడావిడి చేసి వైజాగ్, వరంగల్‌లలో భారీ ఎత్తున ఆడియో ఫంక్షన్లు కూడా చేసిన గుణశేఖర్ ఇప్పుడు ‘రుద్రమదేవి’ గురించి పూర్తిగా మర్చిపోయినట్టున్నాడు. సినిమాని ఎప్పుడు రిలీజ్ చెయ్యాలనే విషయంలో సరైన క్లారిటీ లేని గుణశేఖర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందనే నెపంతో రిలీజ్‌ని వెనక్కి నెట్టేస్తున్నాడు. నిజానికి ‘బాహుబలి’ కంటే ముందే రిలీజ్ అవ్వాల్సిన ‘రుద్రమదేవి’ ఇంత డిలే కావడానికి అసలు కారణం ఏమిటో గుణశేఖర్‌కి మాత్రమే తెలుసు. గత కొన్ని రోజులుగా ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించి ఏదో ఒక స్టిల్‌గానీ, పోస్టర్‌గానీ రిలీజ్ చేస్తూ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తున్న రాజమౌళి ఎట్టి పరిస్థితుల్లో జూలై 10న సినిమాని రిలీజ్ చేసేస్తానంటున్నాడు. అలాగే ఈ నెల 31న చాలా గ్రాండ్‌గా ‘బాహుబలి’ ఆడియో రిలీజ్ అవ్వనుంది. ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించి రాజమౌళి, అతని టీమ్ అంత స్పీడ్‌గా వుంటే గుణశేఖర్ మాత్రం ఒక్కసారిగా స్లో అయిపోయాడు. షూటింగ్ టైమ్‌లో ‘రుద్రమదేవి’ చిత్రానికి సంబంధించి ఏదో ఒక న్యూస్‌ని పంపిస్తూ సినిమాకి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేసిన గుణశేఖర్ ఇప్పుడా సినిమాకి సంబంధించిన ఊసే ఎత్తడం లేదు. భారీ బడ్జెట్‌తో ఇండియాలోనే తొలి స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా అతను నిర్మించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం వార్తల్లో లేదనేది మాత్రం నిజం. ‘రుద్రమదేవి’ అనే సినిమా ఒకటి వుందని, అది రిలీజ్‌కి రెడీ అవుతోందనే విషయాన్ని అందరూ మర్చిపోయారు. ఈ విషయాన్ని గుణశేఖర్ కూడా మర్చిపోయి వుంటాడా?