గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీలో 14 మంది నిర్మాతలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తో ప్రమేయం లేకుండా వారికి నచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. రెండు చానెల్స్ కు మాత్రమే యాడ్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ విషయంపై కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ నిర్మాత సి.కళ్యాన్ ఆ 14 మంది నిర్మాతలతో భేటీ అయ్యి మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అయితే తాజాగా ఈ విషయంపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి 'డీ అంటే డీ' సినిమా ప్లాటినం డిస్క్ వేడుకలో సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ 14 మంది నిర్మాతలు తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందిస్తూ "28 సంవత్సరాలుగా నేను సినీ ఇండస్ట్రీలో ఉన్నాను. జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఎన్నో హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. అలాంటిది ఈరోజు ఆయన సినిమా విడుదల చేయడానికి చాలా అడ్డంకులు వస్తున్నాయి. సహాయం చేయాల్సిన మీడియా రెండు ముక్కలుగా విడిపోయింది. ఈరోజు నేను మీడియాను తక్కువ చేసి మాట్లాడట్లేదు. పరుచూరి బ్రదర్స్ దగ్గర పని చేసి ఓ రైటర్ గా పరిచయమయినప్పుడు మీడియా నాపై ఎన్నో కథనాలు ప్రచురించి అన్ని విధాలా ప్రోత్సహించారు. ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు ఐకమత్యంగా ఉండకుండా వాళ్ళలో వాళ్ళు తగాదాలు పెట్టుకొని సినిమాలపై పడుతున్నారు. అందరు మంచోల్లే. కాని సినిమాను నాశనం చేస్తున్నారు. రెండు చానెల్స్ కే యాడ్స్ ఇవ్వాలంటే చిన్న సినిమాల పరిస్థితేంటి. దయచేసి మీరంతా యూనిటీగా గా ఉండి మీడియా ను యూనిటీ గా ఉంచండి" అని తన ఆవేదన వ్యక్తం చేసారు.