అందరికీ సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ షాకిచ్చాడు. శంకర్, మురుగదాస్ వంటి స్టార్ డైరెక్టర్లను పక్కనపెట్టి కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసిన రంజిత్ అనే యువదర్శకునికి అవకాశం ఇచ్చాడు. ఇలాంటి నిర్ణయాన్ని రజనీ తీసుకోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ‘కొచ్చాడయాన్, లింగ’ చిత్రాల తర్వాత కూడా మరో అగ్రదర్శకుడితో నటిస్తే అంచనాలు మరలా విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని భావించిన రజనీ ఎలాంటి ఇమేజ్ లేని యువదర్శకునితో సినిమా చేయడానికి సిద్దపడ్డాడు. గతంలో కూడా ఆయన ‘బాబా’ వంటి ఘోరపరాజయం తర్వాత ‘చంద్రముఖి’ వంటి చిత్రంలో నటించి సూపర్‌హిట్ సాధించి మరలా ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు కూడా రజనీ అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. వాస్తవానికి రజనీకి రాబోయే చిత్రాన్ని లోబడ్జెట్‌లో తీయాలనే కోరిక ఉంది. దాంతో ఆయన రంజిత్‌తో ఆ ప్రయోగం చేస్తున్నాడు. ఈ చిత్రంలో రజనీనే కాదు... ఇతర టెక్నీషియన్స్ కూడా పెద్దగా పేరులేని వారే. అలాగే ఈ చిత్రం కోసం రజనీ కేవలం 50రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇచ్చాడు. ఇలా తన సినిమాపై ఉన్న అంచనాలు తగ్గించడమే రజనీ ఉద్దేశ్యం. ఈ విషయంలో ఆయన ప్రారంభంలోనే మంచి మార్కులు కొట్టేశాడని కోలీవుడ్ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.