సినిమా కళాకారులంటే అభిమానించేవాళ్ళు ఎక్కువ మంది వుంటారు. అలాగే హీరోలంటే ఇష్టపడేవారు కూడా వుంటారు. అయితే కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి మేము ఫలానా హీరో అభిమానులం అని చెప్పుకుంటారు. ఆ హీరో అభిమానులం అయినందుకు గర్వపడుతున్నామని కూడా చెప్తారు. తమ అభిమానాన్ని చాటుకునేందుకు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టి ఒకింత మంచి పేరు కూడా తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. హీరోల మధ్య పోటీ అనేది లేకపోయినా హీరోల అభిమానుల మధ్య పోటీ, వాదోపవాదాలు అనేవి సర్వసాధారణం. టాలీవుడ్ హీరోల అభిమానుల్లో అవి కాస్త ఎక్కువనే చెప్పాలి. ఒకప్పుడు ఎన్.టి.ఆర్. ఎ.ఎన్.ఆర్, కృష్ణ అభిమానుల మధ్య ఇలాంటి డిస్కషన్స్ ఎక్కువగా వుండేవి. తమ హీరో చేసిన సినిమా ఫ్లాప్ అయితే ఆ అభిమానులకు తీరని అవమానం జరిగినట్టుగా బాధపడేవారు. అది ఆరోజుల్లో. ఇప్పటి పరిస్థితి వేరు. ఐదారు సంవత్సరాల క్రితం వరకు ఒక టాప్ హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే అది వరల్డ్‌వైడ్‌గా ఎన్ని థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది అనేది ఇంపార్టెంట్‌గా మారింది. మరో హీరో సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాని మించి థియేటర్లు పడాలని చూసేవారు. ప్రస్తుతానికి వస్తే ఇప్పుడు 100 రోజుల సినిమాలు కరువైపోయాయి. ఎన్ని రోజులు ఆడిరది అనేదానికంటే ఎంత కలెక్ట్ చేసిందనేది ముఖ్యంగా మారింది. ఎంత పెద్ద హిట్ సినిమా అయినా 100 రోజులు ఆడడం అనేది గగనంగా మారిపోయింది. అలాంటిది బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘లెజెండ్’ ఎమ్మిగనూరులో 400 రోజులు ప్రదర్శింపబడిరది. ప్రస్తుతం నందమూరి అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేయడానికి కారణం ఇదే. ఎన్నడూ లేని విధంగా, ఏ హీరోకీ జరగని విధంగా అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. 80 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో ఇది ఒక గొప్ప పండగగా చెప్పుకుంటున్నారు. ఈరోజు ఎమ్మిగనూరులో జరిగే లెజెండ్ 400 రోజుల ఫంక్షన్‌కి ఎ.పి. ముఖ్యమంత్రి చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ కూడా హాజరవుతున్నారు. ఆ సినిమాకి సంబంధించి మీడియాలో వచ్చిన యాడ్‌లో అప్పట్లో బాలనాగమ్మ, పాతాళభైరవి, అడవిరాముడు చిత్రాలు మాత్రమే ఆయా సంవత్సరాల్లో ఎక్కువ రోజులు ఆడిన చిత్రాలనీ, ఆ సినిమా తర్వాత ‘లెజెండ్’ మాత్రమే 400 రోజులు ఆడిరదని తెగ పబ్లిసిటీ చేస్తున్నారు. మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే మహేష్‌బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ సంగతి ఏమిటి? అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిందని, పోకిరి రికార్డును ఇక ఎవరూ తిరగరాయలేరని చెప్పుకొచ్చారు, ఆ సినిమా కర్నూలులో 561 రోజులు ఆడి రికార్డ్ క్రియేట్ చేసిందని అప్పట్లో యాడ్స్ కుమ్మేశారు. ఆ తర్వాత మగధీర చిత్రం కర్నూలులోనే 750 రోజులు ప్రదర్శింపబడిరదని పబ్లిసిటీ చేసుకున్నారు. ఆ సినిమాలు నిజంగానే అన్నిరోజులు ఆడి వుంటే మరి లెజెండ్ 400 రోజులు ప్రదర్శింపబడడంలో ఆశ్చర్యమేం వుంది. మరి 400 రోజులకే ఎందుకింత ప్రచారం? దీనికి టి.వి. ఛానల్స్ కూడా ఎందుకు వత్తాసు పలుకుతున్నాయి? డైలీ పేపర్స్‌లో డబ్బులిచ్చి యాడ్స్ వేయించుకుంటున్నారు ఓకే. మరి టి.వి. ఛానల్స్ ఈ సినిమా గురించి ఎందుకంత ప్రచారం చేస్తున్నాయి. దర్శకనిర్మాతలు, హీరోల అభిమానులు ఎందుకు ప్రేక్షకుల్ని మభ్యపెడుతున్నారు. ఎప్పటికప్పుడు హీరోల అభిమానులు ప్రేక్షకుల్ని ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది ఇక్కడ ఇచ్చిన పోస్టర్స్‌ని చూస్తే మీకే అర్థమవుతుంది. మరి కొన్నాళ్ళ తర్వాత ఏదైనా సినిమా 200 రోజులు ఆడితే అది కూడా కొత్త రికార్డ్ అని ప్రచారం చేసుకునేందుకు కూడా వెనుకాడరని ఈ సినిమాల పోస్టర్స్ చూస్తుంటే అర్థమవుతోంది.