నిర్మాతగా సి.కల్యాణ్‌కు ఇండస్ట్రీలో ఎంతో పేరుందో.. వివాదాస్పదుడిగా కూడా ఆయన అంతే పేరు గడించాడు. ఇక తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకెక్కాడు. ఓ వైద్యురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కల్యాణ్‌పై కేసు నమోదు చేశారు. వివారల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 11లో కల్యాణ్ నివసిస్తున్నారు. మెట్రో రైలు విస్తరణలో భాగంగా ఇక్కడ కొన్ని అపార్టుమెంట్లకు సంబంధించి నష్టపరిహారాన్ని చెల్లించారు. మొత్తం 1.40 కోట్ల రూపాయల పరిహారం రాగా.. ఈ పరిహారానికి సంబంధించి కల్యాణ్ ఒక్కరే ఓ ప్రత్యేక ఖాతా తెరిచినట్లు సమాచారం. దీనికి మిగిలిన ఫ్లాట్ల యజమానులు ఒప్పుకోకపోవడంతో వారిమధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సి.కల్యాణ్ తనను బెదిరించడమే కాకుండా దాడి కూడా చేశాడని కవిత అనే వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరి నిజంగానే సి. కల్యాణ్ వైద్యురాలిపై దాడి చేసి ఉంటే ఆయనకు చిక్కులు తప్పకపోవచ్చు.